హైద్రాబాద్, ఏప్రిల్ 15, (way2newstv.in)
హైద్రాబాద్ జిల్లాలో పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. సాయంత్రం వాతావరణం చల్ల బడింది.సోమవారం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 43.3డిగ్రీలు నమోదు కాగా.. మధ్యాహ్నం 3గంటల వరకు వేడి గాలులతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మిట్ట మధ్యాహ్నం పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ జనాలు లేక వెలవెల బోయాయి. సాయంత్రం 4గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో అక్కడక్కడ చిరు జల్లులు కురియడంతో వాతావరణం చల్లబడింది. రుతుపవనాలు ఏర్పడడానికి ముందు వాతావరణంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రతలు
పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడంతో చెరువులు, కుంటలు, వాగులు, సముద్రాల నుంచి నీరు ఆవిరి అవుతుందని, దీని ద్వారా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై.. బలమైన గాలులు వీచే అవకాశం ఉంటుందని అంటున్నారు. రాబోయే ఐదు రోజుల్లో వాతావరణంలో మార్పులు.. వాతావరణ విభాగం ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్ వారి సూచనల ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో జిల్లాలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు. 15న 0-6మీ.మీటర్ల వర్షపాతం, తేలిక పాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 42-43డిగ్రీ సెంటీగ్రేడ్‌గాను, కనిష్ఠ ఉష్ణోగ్రత 26-30 డిగ్రీ సెంటీగ్రేడ్‌గా నమోదు కావచ్చని తెలిపారు. గాలిలో తేమ ఉదయం పూట 47-60గా, మధ్యాహ్నం పూట 17-33 వరకు ఉంటుందని పేర్కొన్నారు. తూర్పు దక్షిణ దిశగా గంటకు 60-20కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
No comments:
Post a Comment