Breaking News

22/04/2019

ట్రబుల్ షూటర్ విజయసాయి..

హైద్రాబాద్, ఏప్రిల్ 22  (way2newstv.in)
రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ తర్వాత తమ ప్రధాన శత్రువుగా భావించిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ముఖ్యంగా ఎన్నికల వేళ విజయసాయిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి ఆయన తలనొప్పిగా మారారు. సూటిగా విమర్శలు చేయడంతో పాటు టీడీపీని వివిధ సందర్భాల్లో ఇరుకున పెట్టారాయన. వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటే విజయసాయిరెడ్డి ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో బిజీగా ఉన్నారు. పార్టీలో ఎన్నికల ముందు పెద్దఎత్తున చేరికలు జరగడంలోనూ విజయసాయిరెడ్డి  కీలకంగా వ్యవహరించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ కు ఈ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి అదనపు బలంగా ఉపయోగపడ్డారు. సీనియర్ నేతలను కాదని విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపించిన జగన్ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు. ఎంపీగా వెళ్లగానే ఢిల్లీలో పార్టీ వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి కీలకంగా మారారు. 


ట్రబుల్ షూటర్ విజయసాయి..

ప్రత్యర్థి టీడీపీపై పలు సందర్భాల్లో ఆయన మైండ్ గేమ్ ఆడారు. బీజేపీకి టీడీపీ దూరం కావడానికి విజయసాయిరెడ్డి కూడా ఒక కారణమే. విజయసాయిరెడ్డి పలుమార్లు ప్రధాని కార్యాలయంలో కనిపించడం టీడీపీకి ఇబ్బందిగా మారింది. తర్వాత కూడా పార్టీ తరపున ఢిల్లీలో విజయసాయిరెడ్డి యాక్టీవ్ గా ఉన్నారు. పార్లమెంటులోనూ ఆయన పార్టీ తరపున బాగానే గొంతు వినిపించారు.ఇక, ఎన్నికలవేళ విజయసాయిరెడ్డి మరింత కీలకమయ్యారు. పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలతో ఆయన చర్చలు జరిపి వారిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. వైసీపీకి బలమైన అభ్యర్థులు లేని చోట్ల విజయసాయిరెడ్డి ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలతో చర్చించి వారిని పార్టీలోకి తీసుకువచ్చారు. దీంతో ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచీ వైసీపీలో జోష్ పెరిగింది. టీడీపీ ప్రజాప్రతినిధులే వైసీపీలో చేరడంతో వైసీపీ అధికారంలోకి రాబోతోంది అనే ఒక అభిప్రాయం వచ్చింది. ఇక, ఎన్నికల సమయంలోనూ ఎన్నికల సంఘానికి పార్టీ తరపున విజయసాయిరెడ్డి అనేక ఫిర్యాదులు చేశారు. తెలుగుదేశం ఎక్కడ చిన్న తప్పు చేసినట్లు కనిపించినా విజయసాయిరెడ్డి వెంటనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులు కూడా ఎన్నికల ముందు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రధాన కారణం. ముఖ్యంగా, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావనతో ఆయనతో విజయసాయిరెడ్డి కయ్యానికి దిగారు. అనేక ఫిర్యాదులు చేశారు. చివరకు ఆయనను బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.విజయసాయిరెడ్డి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా కూడా ప్రయత్నించింది. ఓ దశలో విజయసాయిరెడ్డిది చెబుతున్న ఓ ఆడియోను టీడీపీ అనుకూల మీడియా లీక్ చేసింది. దీనికి విజయసాయిరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇందుకు ప్రతీకారంగానే ఏకంగా చంద్రబాబు నాయుడు, సదరు మీడియా సంస్థ అధినేత ఆఫ్ ధి రికార్డ్ గా మాట్లాడుకుంటున్న వీడియోలు ఎన్నికల ముందు బయటకు వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారడం టీడీపీకి ఎంతోకొంత నష్టం చేసింది. ఇలా, తెలుగుదశం పార్టీని, ఆ పార్టీ అనుకూల మీడియాను ఎదుర్కుంటూ వైసీపీ వ్యూహాలను అమలు చేయడంలో విజయసాయిరెడ్డి బాగానే కష్టపడ్డారు. ఈ పనిలో ఆయన చాలానే సక్సెస్ అయ్యారు. మరి, ఆయన కష్టం ఫలించి జగన్ ముఖ్యమంత్రి అవుతారో లేదో మే 23న చూడాలి.

No comments:

Post a Comment