Breaking News

15/04/2019

బొండా ఉమాకు ఎదురీతేనా

విజయవాడ, ఏప్రిల్ 15, (way2newstv.in)
పార్టీల కంటే వ్యక్తుల పరంగా ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ ఒకటి. ఇక్కడ టీడీపీ అభ్యర్ధి బోండా ఉమామహేశ్వరరావు, వైసీపీ అభ్యర్ధి మల్లాది విష్ణు మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. ఇప్పటికే వీరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారం ద్వారా ప్రజల దగ్గరకి వెళుతున్నారు. 2014 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన బొండా ఉమా…ఈ ఎన్నికల్లో కూడా గెలుపు తనదేనని ధీమాగా ఉన్నారు. అటు మల్లాది విష్ణు కూడా ఎలా అయినా వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఉమా ఎమ్మెల్యేగా ఉన్న ఈ ఐదేళ్లలో అభివృద్ధి బాగా జరిగింది. నగర ప్రాంతం కావడం, రాజధానికి దగ్గరగా ఉండటం వలన అన్నీ రకాలుగా అభివృద్ధి పరుగులు పెట్టింది. సమస్యలు పరిష్కరించడంలో ముందున్న ఉమాకి ఇక్కడ ఫాలోయింగ్ బాగానే ఉంది, అన్నీ వర్గాలకి సంక్షేమ పథకాలు అందేలా చేశారు. ఇక వంగవీటి రాధా టీడీపీలో చేరడం బొండాకి ప్లస్ అవుతుంది. అయితే నగరంలో భూకబ్జాలు చేశారనే ఆరోపణలు రావడం ఉమాకి మైనస్ అయ్యే అవకాశం ఉంది.ఉమా దూకుడు స్వ‌భావంతో ఆయ‌న‌కు పార్టీ నేత‌లు చాలా మంది దూర‌మ‌య్యారు. 


బొండా ఉమాకు ఎదురీతేనా 

గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఏకంగా 27 వేల ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది. ఇప్పుడు జ‌న‌సేన ఒంట‌రిగా పోటీలో ఉన్నా… ఇక్క‌డ ఆ పార్టీ పొత్తులో భాగంగా సీటును సీపీఎంకు ఇవ్వ‌డం ఉమాకు క‌లిసొచ్చే అంశ‌మే. నేరుగా జ‌న‌సేన సింబ‌ల్ ఉంటే కాపుల ఓట్లు భారీగా చీలేవి. ఇక్క‌డ ఆ స‌మ‌స్య లేదు. మరోవైపు మల్లాది విష్ణుకి 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. అప్పుడు చేసిన అభివృద్ధి తనకి కలిసొస్తుందని అనుకుంటున్నారు. ఇక గత ఎన్నికలకంటే ఇప్పుడు వైసీపీ బలం పుంజుకుంది. ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత కూడా విష్ణుకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే మల్లాదికి కల్తీ మద్యం వ్యాపారంలో ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. పైగా సెంట్రల్‌లో పట్టున్న రాధా టీడీపీలో చేరడం విష్ణుకి ఎదురుదెబ్బే అని తెలుస్తోంది.జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ సీపీఎం తరుపున బాబూరావు పోటీ చేస్తున్నారు. ఈయనకి పవన్ అభిమానుల మద్ధతు కొంతవరకు ఉండొచ్చు. కానీ సీపీఎంకి గెలిచే అంత సత్తా అయితే లేదు. ఈ నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు, కాపు, బ్రాహ్మణ సామాజికవర్గాల ఓటర్లు కీలకం కానున్నారు. అయితే బోండా ఉమా కాపు సామాజికవర్గ నేత కాగా, విష్ణు బ్రాహ్మణ సామాజికవర్గ నేత. దీంతో ఎవరు ఎవరికి ఎక్కువ మద్ధతు ఇస్తారో తెలిసిపోతుంది. ఏపీలో ఎక్క‌డా లేని విధంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 45 వేల బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గ ఓట‌ర్లు ఉన్నారు. వీరంతా వ‌న్‌సైడ్‌గా చేయ‌డంతోనే 2009లో విష్ణు ట్ర‌యాంగిల్ ఫైట్‌లో విజ‌యం సాధించారు. ఇప్పుడు ఈ వ‌ర్గం ఓట్లు విష్ణుకే వ‌న్‌సైడ్‌గా ప‌డ‌తాయ‌న్న చ‌ర్చ న‌డుస్తోంది.ఇక కాపుల్లో మెజార్టీ వ‌ర్గం ఓట‌ర్లు ఉమాకే స‌పోర్ట్ చేస్తున్నారు. ఇక 20 వేలు ఉన్న క‌మ్మ వ‌ర్గం ఓట్లు ఎలాగూ మెజార్టీ టీడీపీకే ప‌డ‌నున్నాయి. బీసీ, ఎస్సీలలో రెండు పార్టీలకి మద్ధతు ఇచ్చేవారు ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ బోండా ఉమాకే కొంత అనుకూలత కనపడుతున్నప్పటికీ మల్లాది విష్ణుని తక్కువ అంచనా వేయలేం. పోలింగ్ తర్వాత పరిస్థితులు కొంత మల్లాది విష్ణుకే అనుకూలంగా ఉన్నట్లు కన్పిస్తుంది. చూడాలి సెంట్రల్ ప్రజలు ఈ సారి ఎవరి వైపు మొగ్గుచూపుతారో.

No comments:

Post a Comment