Breaking News

15/04/2019

పులిచింతల నీరు వస్తేనే చింత తీరే అవకాశం

గుంటూరు, ఏప్రిల్ 15, (way2newstv.com)
ఎన్నికల బిజీలో ఉన్న అధికారులు తాగునీటిని నిల్వ చేసుకునే విషయం మరిచిపోయారు దీంతో రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి, మంగళగిరి, తెనాలి పురపాలక సంఘాలతో పాటు గుంటూరు నగరపాలక సంస్థకు ప్రస్తుతం నీటి గండం పొంచి ఉంది. ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టినా, అడుగంటినా వెంటనే ఆ విషయాన్ని కృష్ణాడెల్టా చీఫ్‌ ఇంజినీర్‌ దృష్టికి తీసుకెళ్లి నీటి నిల్వలు తగు సామర్థ్యం మేర ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రకాశం బ్యారేజీకి అవసరమైన నీరు పులిచింతల నుంచి రావాలి. అక్కడ డ్యామ్‌లో నీటి నిల్వలు పుష్కలంగానే ఉన్నాయి. అయితే ఆయా పట్టణాల కమిషనర్లు, పురపాలక ఇంజినీర్లు ఈ నీటి నిల్వలు అడుగంటిన విషయాన్ని తీవ్రంగా పరిగణించటంలేదని తెలుస్తోంది. ప్రస్తుతం రోజుకు అంగుళంన్నర నీరు తగ్గుతోందని, ఇప్పుడున్న నీటి నిల్వలు కేవలం 18 రోజులకు మాత్రమే సరిపోతాయని చెబుతున్నారు.


 పులిచింతల నీరు వస్తేనే చింత తీరే అవకాశం

ఈ నాలుగు పట్టణాలకు ప్రకాశం బ్యారేజీ నుంచి పైపులైన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. తద్వారా పట్టణవాసులకు గొంతుతడుస్తోంది. ప్రకాశం బ్యారేజీలో తగినంత నీటి నిల్వ సామర్థ్యాలు లేవని దీంతో ఏక్షణాన అయినా ఈ నాలుగు పట్టణాలకు మంచినీటి సమస్య తలెత్తే అవకాశం లేకపోలేదని పురపాలక ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. తాగునీటి అవసరాలకు మాత్రమే  వినియోగించాల్సిన నీటిని ఇతరత్రా అవసరాలకు మళ్లించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక్కడి నుంచి కొంతమేర నీటిని ఇటీవల కెనాల్స్‌కు విడుదల చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్యారేజీలో 6.7 అడుగుల నీటి నిల్వలే ఉన్నాయి. వాస్తవానికి సగటున ఏ రోజు చూసినా 7-8 అడుగులకు తగ్గకుండా నీటి నిల్వలు ఉండాలి. అప్పుడే నీళ్లు స్థానికంగా పురపాలక సంఘాల వారీగా ఏర్పాటు చేసిన బావుల్లోకి ఇంకుతాయి.బావుల్లో తగినన్ని నీటి నిల్వలు లేక మోటార్ల ద్వారా తోడటం కష్టంగా ఉంది. ఈ విషయాన్ని లేఖ రూపంలో కృష్ణా డెల్టా సీఈకి తెలియజేయాలనే యోచనలో ఉన్నామని గుంటూరు నగరపాలక ఇంజనీరింగ్‌ వర్గాలు తెలిపాయి. కమిషనర్‌ ద్వారా లేఖ రాయిస్తామని పేర్కొన్నారు. ఈ వేసవిలో పులిచింతల నుంచి  ఒక టీఎంసీ నీళ్లు విడుదల చేయించి పొదుపుగా తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకుంటేనే ఉపయోగమని ఓ ఇంజినీరింగ్‌ అంటున్నారు.

No comments:

Post a Comment