Breaking News

02/04/2019

డైరక్టర్ వర్సెస్ డాక్టర్

నెల్లూరు, ఏప్రిల్ 2(way2newstv.in)
ఏపీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ అగ్నిపరీక్షను ఎదుర్కోబోతున్నారు. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఎంట్రన్స్ టెస్ట్ పాసవుతారా? ఫెయిలవుతారా అనే ఆసక్తి నెలకొంది. తన స్వస్థలమైన నెల్లూరు సిటీ నియోవర్గం నుంచి బరిలోకి దిగుతున్న నారాయణ.. తొలి ప్రయత్నంలోనే గట్టి పోటీని ఎదుర్కోనున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పి.అనిల్ కుమార్ యాదవ్‌ కైవశం చేసుకున్నారు. ఈ సారి కూడా ఆయనే వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. జనసేన నుంచి కేతంరెడ్డి వినోద్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నారాయణ తన విజయం కోసం గట్టిగానే చెమటోడ్చాల్సిన పరిస్థితి ఉంది. నారాయణ విద్యా సంస్థలతో తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకున్న నారాయణ.. ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అమరావతిలోని నూతన రాజధాని నిర్మాణంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. నెల్లూరులో చిన్న కోచింగ్ సెంటర్‌తో టీచర్‌గా ప్రస్థానం ప్రారంభించిన నారాయణ.. ఆ తర్వాత నారాయణ విద్యా సంస్థలతో అత్యున్న శిఖరాలను అధిరోహించారు. తర్వాత రాజకీయాలపై ఆసక్తితో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. 2004 నుంచి 2014 వరకు టీడీపీలో తెరవెనుక పాత్ర మాత్రమే పోషించారు. 


డైరక్టర్ వర్సెస్ డాక్టర్

ఆయన పనితనం మెచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు నారాయణకు మంత్రి పదవి ఇచ్చారు.  ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ఇదే మొదటిసారి కావడంతో నారాయణ స్థానిక నేతలు, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీధరకృష్ణారెడ్డి, నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వర్గాలను సమన్వయం చేసుకుని ప్రణాళికబద్దంగా అడుగులు వేస్తున్నారు. నెల్లూరు నగరంలో వైసీపీ బలోపేతమైన స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మరోవైపు ఆయన విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు, పనిచేసి సిబ్బంది సహకారం కూడా తప్పుకుండా ఉంటుందని భావిస్తున్నారు. అయితే, విజయం దక్కాలంటే ఆయన ఇంకా చాలా శ్రమించాల్సి ఉంటుందని విశ్లేషకులు తెలుపుతున్నారు. ప్రస్తుతం నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నారాయణ భార్య రమాదేవి కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇక వైసీపీ నుంచి బరిలోకి దిగిన అనిల్‌కుమార్ యాదవ్ ఓటర్ల నాడి పట్టడంలో నేర్పరి. వైద్య వృత్తి వీడి రాజకీయాల్లో తన లక్ పరీక్షించుకోడానికి వచ్చిన అనిల్ కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారు. 2009లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి ఓటమి చవిచూసిన ఆయన.. 2014లో ఏపీ విభజన నేపథ్యంలో ఆ పార్టీని వీడి వైసీపీలో చేరి విజయం సాధించారు. ఐదేళ్లలో ఆయన స్థానికంగా మంచి పేరునే సొంతం చేసుకున్నారు. ఒక వైపు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. మరోవైపు పార్టీ కేడర్‌ను సమన్వయంతో నడిపిస్తూ స్థానికంగా తన బలాన్ని మరింత పెంచుకున్నారు. పార్టీలోని సీనియర్ నేతల నుంచి కొన్ని ఇబ్బందులున్నా.. ఆయన చేసిన కొన్ని మంచి పనుల వల్ల ఈ ఎన్నికల్లో నారాయణకు అనిల్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నారాయణ ప్రజల నుంచి మంచి మార్కులు సాధిస్తారా లేదా అనేది చూడాలి. 

No comments:

Post a Comment