Breaking News

02/04/2019

కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, ఏప్రిల్2, (way2newstv.in)
కాంగ్రెస్పార్టీ  మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ మంగళవారం గాంధీ విడుదల చేశారు. ఢిల్లీలో హమ్ నిభాయేంగే పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టోను పార్టీ సీనియర్ నేతల సమక్షంలో విడుదల చేశారు. తమ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉందన్నారు. సంక్షేమంతో సంపద సృష్టించడమే లక్ష్యమని రాహుల్ పేర్కొన్నారు. ఉద్యోగ కల్పన, రైతు సమస్యలే ప్రధాన అజెండా అని అన్నారు.  ఇది గదిలో కూర్చుని రూపొందించిన మేనిఫెస్టో కాదని ఆయన చెప్పారు. మేధావులు, నిపుణుల ఆధ్వర్యంలో మేనిఫెస్టోకు రూపకల్పన జరిగిందని ఆయన అన్నారు. మేనిఫెస్టోలో ప్రజలకు కనీస ఆదాయ పథకాన్ని రాహుల్ ప్రకటించారు. ఏటా 72 వేల రూపాయిలు ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని ఆయన చెప్పారు. ఐదేళ్లలో రూ. 3.6 లక్షలు చొప్పున ఒక్కొక్కరిఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తామని ఆయన అన్నారు. 


కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన రాహుల్ గాంధీ

దేశంలో దాదాపు 20 శాతం మంది ప్రజల ఖాతాల్లో నగదు బదిలీ చేస్తామని ఆయన చెప్పారు. అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని, వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి నిధుల్ని పెంచుతామని రాహుల్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు ద్వారా ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఎన్డీయె హయాంలో యువతకు ఉపాధి కల్పన సరిగ్గా జరుగలేదని, ఏటా 2 కోట్ల మదికి ఉపాధి కల్పన హామీని గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. దేశంలో 22 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా 2020 మార్చినాటికి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.  గ్రామ పంచాయతీల్లో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన అన్నారు. గతంలో వ్యాపారం మొదలెట్టాలంటే ఎన్నో అనుమతులు తీసుకోవాల్సి వచ్చేదని, ఇకపై వ్యాపార నిర్వహణకు ఎలాంటి అనుమతి అవసరం లేదని రాహుల్ చెప్పారు. రైల్వే బడ్జెట్ మాదిరిగా రైతులకు ప్రత్యేక బడ్జెట్ ఉండాల్సిన అవసరముందని ఆయన అన్నారు. కొందరు ధనవంతులు రుణాలు తీసుకుని ఎగ్గొడతారని ఆయన చెప్పారు. మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీ వంటి వ్యక్తులు వేల కోట్ల రూపాయిలు రుణాలుగా తీసుకుని ఎగ్గొట్టినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రైతులు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోతే జైలుకు తరలిస్తున్నారని ఆయన అన్నారు. రైతులు రుణాలు చెల్లించకపోతే క్రిమినల్ నేరంగా పరిగణించబోమని, ఉపాధి హామీని 150 రోజులకు విస్తరిస్తామని, బడ్జెట్లో విద్యారంగానికి 6శాతం నిధులు కేటాయిస్తామని, పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని రాహుల్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment