Breaking News

15/04/2019

టీడీపీ గెలుపు ఖాయం

అమరావతి, ఏప్రిల్ 15  (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సర్వే గెలిచేది తెలుగుదేశం పార్టీయే అన్నాయని, తెదేపా గెలుపు 1000 శాతం తథ్యమని ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. పార్టీ నేతలతో ఆయన ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 110-140 సీట్లు తెదేపా సాధిస్తుందనేది సర్వత్రా అభిప్రాయమని ఆయన అన్నారు. తెదేపా పోరాటం చేస్తోంది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికేనని చంద్రబాబు స్పష్టంచేశారు. తెదేపా శ్రేణులన్నీ సంఘటితంగా పనిచేశాయని, అందుకే ఈ ఎన్నికలో తమ గెలుపు ఏకపక్షం అయ్యిందని సీఎం అభిప్రాయపడ్డారు. తెదేపా గెలుపును అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేశారని, అయినా వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నామని చెప్పారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించారని, ఏపీలో 8 లక్షల ఓట్లు తొలగించాలని కుట్రలు చేశారని తెలిపారు.


 టీడీపీ గెలుపు ఖాయం

సకాలంలో స్పందించి ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేశామన్నారు. ఐపీ అడ్రస్ లు ఇవ్వకుండా ఓట్ల దొంగలను కాపాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పోలింగ్ రోజు ఉదయాన్నే ఈవీఎంలు మొరాయించేలా చేశారని, మిషన్ రిపేర్ వస్తే.. కొత్త మిషన్ పెట్టాలని పట్టుబట్టామని చంద్రబాబు తెలిపారు. వెంటనే శాంతి భద్రత సమస్యలు సృష్టించే కుట్రలు చేశారని ఆరోపించారు. భాస్కర రెడ్డి హత్య, స్పీకర్ పై దాడి, మహిళా అభ్యర్థులపై దౌర్జాన్యాలు చేశారని విమర్శించారు. తప్పులు చేసి ప్రజాతీర్పు కాలరాయాలని చూశారని దుయ్యబట్టారు. చెన్నై, షిర్డీ, బెంగళూరు, హైదరాబాద్ నుంచి భారీగా తరలివచ్చి తెదేపాకు అనుకూలంగా ఓటేశారని చెప్పారు. పెద్దఎత్తున తరలివచ్చి ఓటింగ్ లో పాల్గొన్నవారికి అభినందనలు తెలిపారు.
వీవీ ప్యాట్ లను తీసుకొచ్చిన ఘనత తెదేపాదేనని, ఎన్నికల సంఘంపై 15 ఏళ్లుగా తెదేపా పోరాడుతోందని చంద్రబాబు అన్నారు. ఈవీఎంలు వద్దని దేశంలోని అనేక పార్టీలు కోరాయని, ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక్క క్షమాపణతో సరిపెడతారా? అని సీఎం ప్రశ్నించారు. 50 శాతం వీవీ ప్యాట్ రశీదులు లెక్కించడానికి ఎందుకు అభ్యంతరమని ఆయన నిలదీశారు. తెలంగాణలో పోలైన ఓట్ల కన్నా, ఈవీఎంలలో ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. గతంలో బ్యాలెట్ విధానంలో పోల్ అయిన ఓట్లన్నీ ట్యాలీ అయ్యేవని, టెక్నాలజీ వచ్చాక ట్యాలీ కావడం లేదన్నారు. గెలుపుపై భయంతోనే ఈవీఎంలపై తెదేపా పోరాటంగా దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు.

No comments:

Post a Comment