Breaking News

23/04/2019

విజయనగరం రాజుల్లో టెన్షన్... టెన్షన్

విజయనగరం, ఏప్రిల్ 23, (way2newstv.in)
ఈ ఎన్నికలకు రాజులకు పరీక్ష పెట్టాయనే చెప్పాలి. గతం కంటే భిన్నం ఈ ఎన్నికలు. గతంలో రాజులంతా వేర్వేరు పార్టీల్లో ఉండేవారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం అందరు రాజులు ఒకే పార్టీలోకి వచ్చేశారు. అయినా సరే రాజులకు కాలం కలసి రానట్లుంది. గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. గెలుస్తామన్న ధీమా వారిలో ఇసుమంత కూడా కనపడటం లేదు. పార్టీలు మారి వచ్చినా ఫలితంలేని వారు కొందరైతే, సొంత పార్టీ నేతల నుంచే అసంతృప్తి ఎదుర్కొంటున్నవారు మరికొందరు. ఇలా రాజులందరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ గెలుపు అవకాశాలు ఏమాత్రం లేవన్నది ఎన్నికల అనంతరం వెలువడుతున్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.విజయనగరం జిల్లా అంటేనే రాజులు గుర్తుకొస్తారు. పూసపాటి, బొబ్బిలి, కురుపాం వంశీయులు ఈ ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు. మూడు వంశాలకు చెందిన వారు ఈసారి అధికార తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం పార్లమెంటు స్థానానికి, ఆయన కుమార్తె ఆదితి విజయనగరం శాసనసభ స్థానానికి పోటీ చేశారు. అయితే ఇక్కడ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, అశోక్ కు పడిన ఓట్లు ఆదితికి పడలేదని టాక్ నడుస్తోంది. వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి గట్టి పోటీ ఇవ్వడంతో ఆదితి గెలుపు కష్టమేనంటున్నారు. 


విజయనగరం రాజుల్లో టెన్షన్... టెన్షన్

అశోక్ కుటుంబానికి దెబ్బతగలడానికి ఆయన వద్ద గత కొన్నేళ్లుగా ఉన్న ఇద్దరు ప్రధాన అనుచరులే కారణమని, వారి వల్లనే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందంటున్నారు.ఇక బొబ్బిలి నియోజకవర్గంలో మంత్రి సుజయ కృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వరసగా మూడుసార్లు గెలిచిన బొబ్బిలి రాజులకు ఈసారి గట్టిపోటీ ఎదురయింది. పోలింగ్ జరిగిన తీరుపై సుజయకృష్ణ రంగారావు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పోలింగ్ ముందు వరకూ గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్న రంగారావు పోలింగ్ రోజున సీన్ రివర్స్ అయిందని గుర్తించారు. వైసీపీ అభ్యర్థి శంబంగి చిన అప్పలనాయుడు తనకు ధీటైన ప్రత్యర్థి కాదని భావించిన సుజయ్ ఆయన దూకుడుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. వైసీపీ సీనియయర్ నేత బొత్స సత్యనారాయణ బొబ్బిలిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల్లో డబ్బుల పంపిణీని కూడా సక్రమంగా చేయనివ్వకుండా వైసీపీ అడ్డుకోవడం, ఆర్థిక లావాదేవీల విషయంలో బొబ్బిలి రాజుల సోదరుల మధ్య విభేదాలు తలెత్తినట్లు టాక్ గట్టిగా విన్పిస్తుంది.ఇక కురుపాంలో కూడా మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్ నామినేషన్ చెల్లకపోవడంతో ఆయన తల్లి నరసింహ ప్రియ బరిలోకి దిగారు. నరసింహ ప్రియ విజయానికి శత్రుచర్ల విజయరామరాజు తీవ్రంగా కృషి చేశారు. ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా మొదట్లో ఉన్నా పోలింగ్ సమయానికి అది ఎగిరిపోయిందంటున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి శత్రుచర్ల కుటుంబానికి గట్టి సవాల్ విసిరారు. పోలింగ్ రోజున జియ్యమ్మవలస మండలం చినకుదుమ గ్రామంలో పుష్ప శ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజుపై దాడి చేయడం, నిర్భంధించడం టీడీపీ ఓటమి భయంతోనేనని చెబుతున్నారు. మొత్తం మీద మూడు రాజకుటుంబాల్లో ఎప్పుడూ లేని విధంగా గెలుపు టెన్షన్ పట్టుకుందన్నది తాజా సమాచారం.

No comments:

Post a Comment