Breaking News

08/04/2019

అందరి దృష్టి ఆర్మూర్ వైపే

నిజామాబాద్, ఏప్రిల్ 8  (way2newstv.in)
పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి నిజామాబాద్ పార్లమెంటు స్థానంపై పడింది. ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పోటీలో ఉండటంతో పాటు ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు నామినేషన్లు వేయడంతో నిజామాబాద్ ఎన్నికలపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. ఎంపీగా కవిత రెండోసారి సులువుగా గెలుస్తారని అనుకుంటుండగా రైతుల నామినేషన్ల వ్యవహారం ఆమెకు తలనొప్పిగా తయారైంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా నిజామాబాద్ పార్లమెంటు స్థానంపై కన్నేయడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ఏకంగా 185 మంది బరిలో ఉన్న ఈ స్థానంలో ఎన్నికల సమీపిస్తున్నా ఇంకా ఎన్నికలు సమయానికి జరుగుతాయో లేదో అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు ఎలా ఉన్నా అభ్యర్థులు మాత్రం గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసుకుంటున్నారు.గత ఎన్నికల్లో మొదటిసారి ఎన్నికల బరిలో నిల్చున్న కవిత కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ పై 1.67 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు మధుయాష్కి రెండుసార్లు నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగిత్యాల మినహా ఆరు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. గత ఐదేళ్లలో టీఆర్ఎస్ ఇక్కడ మరింత బలోపేతమయ్యింది. 


అందరి దృష్టి ఆర్మూర్ వైపే

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలనూ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరి ఓటింగ్ జరిగితే కవిత సుమారు రెట్టింపు మెజారిటీతో గెలవాలి. కానీ ఇటీవలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. ఇది టీఆర్ఎస్ కు కొంత మింగుడుపడని వ్యవహారమే. దీంతో కొంతసేపటి క్రితం టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి మరీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం విశేషం.ఇక, ఎర్రజొన్న, పసుసు రైతులకు మద్దతు ధర కల్పించడం లేదనే నిరసనతో ఏకంగా 176 మంది రైతులు నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికలు బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో జరుగుతాయా లేదా ఈవీఎంల ద్వారా జరగుతాయా, అసలు సమయానికి ఎన్నికలు జరుగుతాయా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో ఉంది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మధుయాష్కి గౌడ్ ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన ఎన్నికల్లో ఓడిన తర్వాత నిజామాబాద్ ను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరి నిమిషం వరకు భువనగిరి నుంచి పోటీ చేయాలని భావించారు. దీంతో ఆయన రేసులో కొంత వెనుకబడ్డారు. ఇక, నిజామాబాద్ లో బీజేపీ ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ పార్టీ నుంచి డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అర్వింద్ పోటీలో ఉన్నారు. ఆయన మూడేళ్లుగా నియోజకవర్గంలో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. స్వంతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఆయన గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ దశలో మధు యాష్కి కంటే అర్వింద్ టీఆర్ఎస్ కు ఎక్కువ పోటీ ఇచ్చే అవకాశమూ ఉంది. మొత్తానికి కవిత సులువుగా గెలుస్తుందనుకున్న స్థానంలో ఆమె గెలుపునకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.

No comments:

Post a Comment