Breaking News

08/04/2019

తెలంగాణ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షే

హైద్రాబాద్, ఏప్రిల్ 8(way2newstv.in)
తెలంగాణలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ మినహా అన్ని స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్... ఇందుకు సంబంధించి పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. లోక్ సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... కొన్ని స్థానాల్లో మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలకు తగ్గట్టుగానే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఎంపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను కూడా స్థానిక ఎమ్మెల్యేలపైనే కేసీఆర్ పెట్టినట్టు టీఆర్ఎస్‌లో టాక్ వినిపిస్తోంది. 


తెలంగాణ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షే

ఎంపీ అభ్యర్థులను గెలిపించే విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా కష్టపడాలని కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. ఎక్కడా ఎంపీలకు మెజార్టీ తగ్గరాదని కేసీఆర్ వారికి హెచ్చరికతో కూడిన సూచన చేసినట్టు ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఎంపీలకు ఆయా నియోజకవర్గాల్లో లభించే మెజార్టీ ఆధారంగానే... ఎమ్మెల్యేలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పరోక్షంగా స్పష్టం చేశారని తెలుస్తోంది. ఈ విషయంలో అవసరమైతే... జిల్లా మంత్రుల సహకారాన్ని తీసుకోవాలని సూచించిన గులాబీ బాస్... ఏ కారణం చేతనైనా ఎంపీ అభ్యర్థులకు మెజార్టీ తగ్గితే అందుకు ఎమ్మెల్యేలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఎంపీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు పరిమితమయ్యారని... ఈ ఎన్నికను తమ ఎన్నికల కంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికలు... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టెన్షన్‌గా మారినట్టు కనిపిస్తోంది. 

No comments:

Post a Comment