Breaking News

24/04/2019

గంటా మనస్సులో వెలితి

విశాఖపట్టణం, ఏప్రిల్ 24, (way2newstv.in)
ఎన్నికల ప్రచారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరులు ప్రతీ రోజూ చెప్పే మాట. గంటా మెజారిటీ యాభై వేలు. ఇది ఖాయం అంటూ తెగ ఊదరగొట్టారు. అయితే ఎన్నికలు జరిగిపోయిన తరువాత మాత్రం ఎక్కడా మెజారిటీ ఊసు లేదు, గెలుస్తామని నేతలు చెబుతున్నారంతే. మరి ఇంతలో ఎందుకింత మార్పు వచ్చిందన్నదే ఎవరికీ అంతుపట్టడంలేదు. నిజానికి విశాఖ ఉత్తరం నుంచి మంత్రి గంటా పోటీ చేస్తారనగానే గెలుపు ఖాయమని మొదట్లో గట్టిగా అనుకున్నారు. ప్రచారంలోకి దిగడంతో మెల్లగా వ్యతిరేకత బయటపడింది. అక్కడ గత రెండు దశాబ్దాలుగా టీడీపీ జెండా ఎగరకపోవడం పెద్ద మైనస్ పాయింట్ అలాగే, అప్పటికే పార్టీలో పోటీకి అరడజనుకు తక్కువ కాకుండా నాయకులు రెడీ కావడం మరో కీలకమైన అంశం. దాంతో గంటా అనుకున్నంత సీన్ అక్కడ లేదని ఆదిలోనే తేలిపోయింది.ఇక గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం ఈసారి సరిగ్గా చేయలేదన్న మాట కూడా వినిపించింది. ఆయన చివరి నిముషంలో భీమిలీ నుంచి ఉత్తరానికి షిఫ్ట్ కావడంతో టైం కూడా సరిపోలేదని అంటున్నారు. 


 గంటా మనస్సులో  వెలితి

దానికి తోడు, పార్టీలో అసమ్మతి నాయకులను బుజ్జగించి దారికి తెచ్చుకునేసరికి పుణ్య కాలం గడచిపోయిందని అంటున్నారు. అదే విధంగా గంటా నియోజకవర్గంలోకి కుల నాయకులను చేరదీసి చేర్చుకోవడం, ప్రత్యర్ధి పార్టీ వైసెపీ నుంచి నేతలకు ఎర వేయడం వంటివి చేశారు, ఇలాంటి వ్యూహాలతోనే ఆయన ఎన్నికల తతంగం ముగిసింది. మరో వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీకి చెందిన రాజు గారు గంటాపై చేసిన అవినీతి ఆరోపణలను బలంగా తిప్పికొట్టలేకపోయారని అంటున్నారు. అలాగే చాన్నాళ్లుగా అక్కడే ఉంటూ చాప కింద నీరులా ప్రచారం చేసిన వైసీపీ అభ్యర్ధి కెకె రాజుని తక్కువగా అంచనా వేశారని చెబుతున్నారు.మొత్తం మీద గంట తనకున్న మంత్రి ఇమేజ్ తోనే ఈ ఎన్నికల్లో నెగ్గుకురావాల్సివుందంటున్నారు. అర్బన్ ఏరియా ఎక్కువగా ఉన్న నార్త్ లో గంటా అవినీతి మీద జనంలో వచ్చిన వ్యతిరేకత ఓ మైనస్ గా ఉంటే, ఆయన ప్రచారానికి సరిగ్గా రాకపోవడం కూడా ప్రతికూల అంశమైంది. ఇక కుల నాయకులను దగ్గర పెట్టుకుంటే మేము ఓట్లు వేయాలా అంటూ ఆయా సామాజిక వర్గాలు తిరుగుబాటు చేయడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా గంటా తక్కువ మెజారిటీతోనైనా గెలవడం ఖాయమన్న మాట పోస్ట్ పోల్ సర్వే అనంతరం వినిపిస్తోంది. ఇక్కడ టైట్ ఫైట్ నడిచిందని, వైసీపీ గాలి బలంగా వీస్తే ఫలితాలు తారుమారైనా ఆశ్చర్యం లేదని కూడా అంటున్నారు. ఇపుడు గంటా శిబిరంలో వినిపిస్తున్న మాట ఇరవై వేల మెజారిటీతో గెలుస్తామని, అంటే ముప్పయి వేల మెజారిటీని వారే తగ్గించుకున్నారు. మరి జనాలు ఎంత కట్టబెడతాయో, ఎవరిని గెలిపిస్తాయో చూడాల్సి ఉంది.

No comments:

Post a Comment