Breaking News

05/04/2019

నిఘా మరింత పటిష్టం (శ్రీకాకుళం)

శ్రీకాకుళం, ఏప్రిల్05 (way2newstv.in): ఎన్నికల మహాయజ్ఞంలో ప్రతి ఓటరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలనే ఎన్నికల సంఘం ఆలోచన చేస్తోంది. చుట్టూ మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు అనుమానముంటే..ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులుంటే..ఎక్కడ బాంబులు పేల్చుతారో అన్న వాతావరణం కనిపిస్తుంటే..ఓటరు పోలింగ్‌ కేంద్రం వరకూ రావటానికి ఆలోచిస్తారు! అలాంటి కొన్ని ప్రాంతాలను గుర్తించిన యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.  ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతం(ఏవోబీ)లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు శాఖ ఏవోబీలో నిఘా ముమ్మరం చేసింది. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న ప్రజాప్రతినిధుల భద్రతనూ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని తొమ్మిది పోలీసు స్టేషన్ల పరిధిలో పక్కాగా నిఘా వేయనున్నారు. ప్రత్యేక బలగాలతో  అణువణువూ జల్లెడపడుతోంది.బత్తిలి, సీతంపేట, దోనుబాయి, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, మందస, వజ్రపుకొత్తూరు, పలాస ప్రాంతాలలోప్రత్యేక బలగాలతో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. వీటి పరిధిలోని 28 పోలింగ్‌ బూత్‌లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.


నిఘా మరింత పటిష్టం (శ్రీకాకుళం)

 ఒడిశాకు సమీపంలో ఉండటం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను లెక్కలోకి తీసుకున్నారు. ఎన్నికల రోజున ఇక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. చూట్టూ డ్రోన్‌ కెమెరాలు, వీడియో చిత్రీకరణ బృందం, బాడీవన్‌ కెమెరాలును ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయుధాలతో కూడిన ప్రత్యేక బలగాలను ఇక్కడ ఉంచుతారు. రోడ్లు, కల్వర్టులు, వాహనాలు ముమ్మరంగా తనిఖీ చేయనున్నారు.భద్రతా చర్యలకు ఐటీబీపీ, ఏపీఎస్పీ, ఆర్మిడ్‌ రిజర్వు, స్పెషల్‌ పార్టీ, సివిల్‌ఫోర్స్‌లను వినియోగించనున్నారు. ప్రతివ్యక్తిని, ప్రాంతాలను క్షుణ్ణంగా వీరు పరిశీలిస్తారు. పోలింగ్‌కేంద్రం సమీపంలో 100 మీటర్ల లోపు ఎవరైనా గలాట సృష్టించేందుకు ప్రయత్నిస్తే అదుపులోకి తీసుకుంటారు. ఇప్పటికే ప్రత్యేక బలగాలు సరిహద్దుప్రాంతంపై నిఘా పెంచారు. ఇప్పటికే ఒడిశా పోలీసులతో కలసి సంయుక్తంగా కూంబింగ్‌ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో తిరిగే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించనున్నారు. ఏవోబీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ముందుగానే చర్యలు చేపట్టింది. ప్రచారానికి వెళ్లే ముందు స్థానిక పోలీసుస్టేషన్‌కు సమాచారాన్ని అందిస్తే ప్రత్యేకబలగాలతో కూడిన బందోబస్తును నాయకులకు ఏర్పాటు చేస్తారు.జిల్లాలో ఉద్దానం ప్రాంతంలోని మందస, వజ్రపుకొత్తూరు, సోంపేట, ఇచ్ఛాపురం, పలాస మండలాల్లో మావోయిస్టు సానుభూతిపరులు కొందరి కదలికలపై పోలీసులు నిఘా పెంచినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలను బహిష్కరించాలనే రీతిలో ప్రచారం చేస్తున్నారనే విషయం గుర్తించినట్లు తెలిసింది. భద్రతలో భాగంగా ఈ అంశంపైనా దృష్టిసారించారు.

No comments:

Post a Comment