Breaking News

13/03/2019

లక్ష్మీస్ ఎన్టీఆర్ పై పెరుగుతున్న క్యూరియాసిటీ

హైద్రాబాద్, మార్చి 13, (way2newstv.in)
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తున్నానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించగానే అందరి కళ్లు దీనిపై పడ్డాయి. వివాదాలకు మారుపేరైన వర్మ కచ్చితంగా దీన్ని కూడా వివాదం చేస్తారని అంతా భావించారు. అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకున్నారు వర్మ. లక్ష్మీపార్వతిని దేవతగా చూపిస్తూ.. చంద్రబాబు నాయుడిని భూతంగా మార్చేశారు. ‘వెన్నపోటు’ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఈ సినిమాపై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. వాస్తవానికి ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఈ వెన్నుపోటు ఎపిసోడ్ అంటేనే చాలా మందికి ఆసక్తి. అందుకే దీన్నే ప్రధాన కథాంశంగా వర్మ తీసుకున్నారు. సినిమాను విజయవంతంగా పూర్తిచేసి మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 


లక్ష్మీస్ ఎన్టీఆర్ పై పెరుగుతున్న క్యూరియాసిటీ

ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ సినిమా విడుదలను తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతుంటే ఈ వర్మ గోలేంటని తలపట్టుకుంటున్నారు. ఎలాగైనా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను విడుదల కాకుండా ఆపేయాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ గోపాల్ వర్మే ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని వర్మ పేర్కొన్నారు. ఈ సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్‌గా చూపించారని, కాబట్టి ఈ సినిమా ఓటర్లపై ప్రభావం చూపుతుందని చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారట. తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని కోరారట. అయితే, ఇలాంటి ఫిర్యాదులు నిజాన్ని ఆపలేవని వర్మ అంటున్నారు. ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో చూద్దాం.

No comments:

Post a Comment