Breaking News

13/03/2019

టీడీపీ గూటికే హర్షకుమార్...

విశాఖపట్టణం, మార్చి 13, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతోపాటు అసెంబ్లీకి ఎన్నికల నగరా మోగడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ నేడో రేపో తొలి జాబితాను ప్రకటించనున్నాయి. ఇక, కీలక పార్లమెంటు స్థానాల విషయంలో టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యమంగా తూర్పుగోదావరిలోని అమలాపురం లోక్‌సభ సీటు విషయంలో ఆ పార్టీ మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీడీపీ తరఫున విజయం సాధించిన పండుల రవీంద్రబాబు ఇటీవలే వైసీపీలో చేరారు. ఆయనకు మరోసారి టీడీపీ టిక్కెట్ దక్కదనే సంకేతాలు వెలువడటంతోనే పార్టీ మారినట్టు ప్రచారం సాగింది. ఇక్కడ దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాధుర్ పేరును ఒక దశలో అధిష్ఠానం పరిశీలించింది. 


టీడీపీ గూటికే హర్షకుమార్...

అయితే, తాజాగా హరీష్‌ను అమలాపురం అసెంబ్లీ నుంచి పోటీకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారనేది సమాచారం. అమలాపురం లోక్‌సభకు మాజీ ఎంపీ హర్షకుమార్‌ పేరును టీడీపీ అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకుంది. ఈ విషయమై జిల్లాలో ఉన్న సిటింగ్‌ ఎమ్మెల్యేలతోపాటు నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన నేతల నుంచి అభిప్రాయాలు సేకరించి ఆయన అభ్యర్థిత్వంపై టీడీపీ అధినేత మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా హర్షకుమార్‌‌తో చర్చలకు సీనియర్ నేతలు యనమల, సుజనా చౌదరిలను రంగంలోకి దింపింది. ఆయనతో చర్చలు సఫలమైనట్టు సమాచారం. దీనిపై హర్షకుమార్ మాట్లాడుతూ.. తాను టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని, ఇప్పటికే కొంతమంది నాయకులు తనతో మాట్లాడారని, ఇక ముఖ్యమంత్రితో మాట్లాడడమే మిగిలిందన్నారు. నేతలను గౌరవించే నాయకుడు చంద్రబాబుని, నేతలను అవమానపరిచే మనస్తత్వం జగన్‌దని హర్షకుమార్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూస్తున్నానని, అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు

No comments:

Post a Comment