విజయవాడ, మార్చి 14, (way2newstv.in)
పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన... అందులో భాగంగా తొలి విడతలో 32 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత జనసేన అధికారికంగా ఈ జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులందరితో మరోసారి మాట్లాడిన తరువాతే జాబితాను ఖరారు చేసినట్టు పవన్ కళ్యాణ్... ఈ జాబితాను ఖరారు చేసినట్టు జనసేన వర్గాలు ప్రకటించాయి.
ఐదు జిల్లాలపైనే పవన్ గురి
మరోవైపు తొలి జాబితాలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు జనసేన అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని బట్టి... పవన్ కళ్యాణ్ అసలు టార్గెట్ ఆ ఐదు జిల్లాలే అనే టాక్ వినిపిస్తోంది. లోక్ సభ అభ్యర్థులను కలుపుకుంటే ఈ ఐదు జిల్లాల నుంచే జనసేన అధికారికంగా 23 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. మిగతా జిల్లాలతో పోల్చితే... ఈ ఐదు జిల్లాల్లోనే జనసేన బలం కాస్త ఎక్కువగా ఉందనే ఊహాగానాలు ఎక్కువగా వినిపించాయి. ఈ నేపథ్యంలో... జనసేన తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థులే ఆ పార్టీకి కీలకం కాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు తొలి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంతో... ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై జనసేన వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే తొలి జాబితాలో పవన్ పోటీ చేస్తారని భావిస్తున్న గాజువాక, పిఠాపురం నియోజకవర్గాల అభ్యర్థుల ప్రస్తావన లేకపోవడంతో... ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
No comments:
Post a Comment