Breaking News

14/03/2019

వైసీపీలో పీకే... టీడీపీలో ఎల్ ఆర్

విజయవాడ, మార్చి 14, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ఏపీలో మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు టీడీపీ, అధికారం దక్కించుకునేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అధికారంలోకి రాకపోయినా... కింగ్ మేకర్ కావాలని జనసేన ప్లాన్ చేసుకుంటోంది. అయితే అధికారం కోసం హోరాహోరీగా పోరాడుతున్న టీడీపీ, వైసీపీల్లో కీలక నిర్ణయాలన్నీ ఆ పార్టీ ఎన్నికల వ్యూహాకర్తలు ఇచ్చే నివేదికల ఆధారంగానే తీసుకుంటున్నారు. వైసీపీకి ఎన్నికల వ్యూహాకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్... ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా జగన్‌కు నివేదికలు అందజేస్తున్నారు. వీరు ఇచ్చే నివేదికల ఆధారంగానే ఆయా అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలా ? వద్దా ? అనే దానిపై వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 


వైసీపీలో పీకే... టీడీపీలో ఎల్ ఆర్

వైసీపీ నేతలకు టికెట్ల కేటాయించే అంశంపై కొందరితో ప్రశాంత్ కిశోరే స్వయంగా చర్చలు జరుపుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీలోని సీనియర్ నేతలు సైతం ప్రశాంత్ కిశోర్ నివేదికల ఆధారంగానే తమ పార్టీ నేతలకు టికెట్లు ఇస్తున్నారనే విషయంగా ఆఫ్ ది రికార్డ్ అంగీకరిస్తున్నారు. ఇక ప్రశాంత్ కిశోర్ తరహాలో బహిరంగంగా కాకపోయినప్పటికీ... టీడీపీకి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సైతం ఎన్నికల వ్యూహాకర్త తరహాలోనే సేవలు అందిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.రెండు రోజుల క్రితం వంగవీటి రాధాకృష్ణ చంద్రబాబుతో సమావేశమైన సమయంలోనూ లగడపాటి రాజగోపాల్ అక్కడే ఉండటం మరో విశేషం. ఒక్క వంగవీటి విషయంలోనే కాదు... అనేక మంది అభ్యర్థులకు సంబంధించిన పనితీరు వివరాలను లగడపాటి రాజగోపాల్ అందిస్తున్నట్టు తెలుస్తోంది. కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కోడెల వంటి సీనియర్ నేతలతోనూ లగడపాటి రాజగోపాల్ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించినట్టు టాక్ వినిపించింది. తన టీమ్ ద్వారా సర్వేలు చేయించి ప్రజానాడిని ఒడిసిపట్టుకోవడంలో అనేకసార్లు విజయం సాధించిన లగడపాటిని... చంద్రబాబు ఎక్కువగా విశ్వసిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అధికారికంగా అంగీకరించకపోయినా... వైసీపీలో ప్రశాంత్ కిశోర్, టీడీపీలో లగడపాటి రాజగోపాల్ పాత్ర ఎంతో కీలకంగా కనిపిస్తోంది.

No comments:

Post a Comment