Breaking News

14/03/2019

ఆ రాష్ట్రాల్లో గ్రిప్ కోసం...

బీజేపీ, కాంగ్రెస్ పోరాటం
న్యూఢిల్లీ, మార్చి 14, (way2newstv.in)   
సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రత్యేకించి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ మూడు రాష్ట్రాల్లో అధికార బీజేపీని ఓడించి హస్తం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడమే ఇందుకు కారణం. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 65 లోక్ సభ స్థానాలున్నాయి. మధ్యప్రదేశ్ 29, రాజస్థాన్ 20, ఛత్తీస్ ఘడ్ లలో 11 స్థానాలున్నాయి. రేపటి లోక్ సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో హస్తం పార్టీ తన పట్టు కాపాడుకుంటుందా? విపక్ష భారతీయ జనతా పార్టీ తన పూర్వ వైభవాన్ని సాధిస్తుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. రెండు ప్రధాన జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి.2014 లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో బీజేపీ విజయదుందుభి మోగించింది. మొత్తం 29 లోక్ సభ స్థానాలకు గాను 27 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. గుణలో కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా, చింద్వారాలో సీనియర్ నాయకుడు కమల్ నాధ్ విజయం సాధించారు. కమల్ నాధ్ వరుసగా పదిసార్లు ఇక్కడి నుంచి గెలుపొందడం విశేషం. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పీసీపీ చీఫ్ గా పార్టీని విజయ పథాన నడిపించిన ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2015 జూన్ లో బీజేపీకి చెందిన రత్లాం ఎంపీ కాంతిలాల్ భూరియా ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ బలం పార్లమెంటులో మూడుకు పెరిగింది. 


ఆ రాష్ట్రాల్లో గ్రిప్ కోసం...

రేపటి లోక్ సభ ఎన్నికల్లో హస్తం పార్టీ బాధ్యతలన్నీ సీఎం కమల్ నాధ్ భుజస్కంధాలపై పడ్డాయి. సీనియర్ నాయకుడిగా, సీఎంగా, రాహల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన కమల్ నాధ్ యావత్ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, అన్నీ పనులను ఆయనే చక్కబెట్టనున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114, బీజేపీ 109 స్థానాలను సాధించాయి. బీజేపీ ఓడినప్పటికీ గౌరవప్రదమైన స్థానాలను సాధించింది. అందువల్ల రేపటి ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటామన్న ధీమాలో కమలనాధులు ఉన్నారు. దాదాపు పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ మచ్చలేని వ్యక్తిత్వం తమను కాపాడుతోందని కమలం పార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉపయోగపడుతుందని భావిస్తోంది. మొత్తం మీద ఈ ఎన్నికలు కమల్ నాధ్, శివరాజ్ సింగ్ చౌహాన్ లకు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. తమ మనుగడ కోసం వారు పోరాడుతున్నారు.గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండో అతి పెద్ద రాష్ట్రం రాజస్థాన్, బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్న వసుంధరరాజేను ఓడించి కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్ సీఎం అయ్యారు. సీనియర్ నాయకుడైన గెహ్లాట్ కు రాష్ట్ర రాజకీయాలు కొట్టిన పిండి. ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఇది మూడోసారి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ బొటాబొటి మెజారిటీ సాధించింది. రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాలను 2014లో బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. హస్తం పార్టీకి ఒక్క స్థానమూ దక్కలేదు. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 200 స్థానాలకు గాను 100 స్థానాలను సాధించింది. ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి ఓడిపోవడం రాజస్థాన్ లో ఆనవాయితీగా వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఇది వర్తిస్తుంది. కొంత వరకూ లోక్ సభ ఎన్నికలకూ వర్తిస్తుంది. 2014 అనంతరం అజ్మీర్, అల్వాల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించడం విశేషం. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగింది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడు, యువనాయకుడైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ నాయకత్వంలో పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది. మొత్తం స్థానాల్లో కనీసం సగానికి పైగా పది నుంచి పదిహేను స్థానాలను గెలవాలన్న లక్ష్యంతో పార్టీ ఎన్నికల గోదాలోకి దిగనుంది. బీజేపీ వ్యవహారాలన్నీ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే చుట్టూ తిరుగుతున్నాయి. రెండు పార్టీలు లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడో రాష్ట్రం ఛత్తీస్ ఘడ్. వరుసగా పదిహేనేళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. పీసీపీ చీఫ్ భూపేశ్ బఘేలో్ నేతృత్వంలో హస్తం పార్టీ దూసుకెళ్లింది. 90 స్థానాలుగల అసెంబ్లీ లో కాంగ్రెస్ 68, బీజేపీ 15 స్థానాలు సాధించాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 11 కు గాను 10 స్థానాల్లో కమలనాధులు గెలుపొందారు. ఈసారి అదే ఫలితాన్ని రాబట్టాలని రమణ్ సింగ్ ప్రయత్నిస్తున్నారు. కానీ కనీసం సగం స్థానాల్లో విజయ దుందుభి మోగిస్తామని ముఖ్యమంత్రి బఘేల్ ధీమాగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత కనపడక పోవడం హస్తం పార్టీకి సానుకూల అంశాలు. మొత్తం మీద ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు రెండు పార్టీలకు కత్తిమీద సాములా మారాయి.

No comments:

Post a Comment