విజయవాడ, మార్చి 5, (way2newstv.in)
ఓటుకు నోటు కేసు తర్వాత మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది డేటా చోరీ కేసు. ఈ కేసు ఏకంగా రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదంగా మారి ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు పెట్టే వరకు వెళ్లింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సహా చాలా మంది టీడీపీ నేతలు ఈ వ్యవహారంపై టీఆర్ఎస్, వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పైన ఇది దాడి అని చెబుతున్నారు. అయితే, ఒక చిన్న స్టార్టప్ వంటి కంపెనీపై పోలీసులు సోదాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలు ఇంతగా ఎందుకు స్పందిస్తున్నారు ? ఏకంగా ముఖ్యమంత్రి.. డీజీపీ, అడ్వకేట్ జనరల్ లో ఈ కేసు వ్యవహారంపై సమీక్షించాల్సిన అవసరం ఉందా ? ఒక ప్రైవేటు కంపెనీపై కేసు నమోదైతే తనపై కుట్ర అని చంద్రబాబు ఎందుకు అంటున్నారు ? ఈ కేసులో ఇటువంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కూడా ఈ కేసుపై స్పందించి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇది రెండు ప్రభుత్వాల మధ్య వివాదంగా మారుతోంది.ఒక ఫిర్యాదుదారుడు ఓ సంస్థపై ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేసి అతడు చేసిన ఫిర్యాదులో వాస్తవం ఉంటే పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఐటీ గ్రిడ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.
రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా డేటా చోరీ
అయితే, ఓ వైపు సంస్థలో సోదాలు ప్రారంభం కాగానే ఓ ఉద్యోగి మిస్సింగ్ అంటూ ఏపీలో ఫిర్యాదు నమోదైంది. హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకునే వ్యక్తి మిస్ అయితే గుంటూరు లో కేసు నమోదైంది. మిస్సింగ్ కేసులో ఏసీపీ, ఇన్స్ పెక్టర్ స్థాయి అధికారులు మూడున్నర గంటల్లో హైదరాబాద్ రావాల్సినంత తొందర ఏముందని టీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆ వ్యక్తి తమ వద్ద సాక్షిగా ఉన్నారని చెప్పినా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేయడం, ఫిర్యాదుదారుడు లోకేశ్వర్ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ కేసు విషయాన్ని అంతలా సీరియస్ గా తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిబంధనల ప్రకారం, పరిమితులకు లోబడే ఈ కంపెనీ వద్ద డేటా ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఈ సంస్థ దొడ్డిదారిన ఏపీ ప్రజల డేటా చోరీ చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఎందుకు హైరానా పడుతున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా ఈ విషయంలో మూడు రోజులుగా వరుస ట్వీట్లు చేస్తున్నారు.ఐటీ గ్రిడ్ సంస్థతో టీడీపీకి ఉన్న ఏకైక సంబంధం.. టీడీపీకి చెందిన సేవామిత్ర అనే యాప్ ను రూపొందించింది. అంతమాత్రానికి ఈ సంస్థలో సోదాలు జరిగితే టీడీపీ నేతలు ఎందుకు హైరానా పడుతున్నారు. సోదాలు ప్రారంభం కాగానే ఏపీ పోలీసులు హైదరాబాద్ లో వాలిపోవడం, చంద్రబాబు, లోకేష్ సహ టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించడంతో ఈ విషయం బాగా చర్చనీయాంశమైంది. అంతకుముందు మీడియా సైతం ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ నేతలు హైరానా పడటం మూలంగానే ఇది చర్చనీయాంశమైంది. కేటీఆర్ కౌంటర్ ఇవ్వడంతో మరింత ప్రజల్లోకి వెళుతోంది. టీడీపీ నేతలు ఈ అంశాన్ని ఎంతలా సీరియస్ గా తీసుకున్నారంటే… ఏకంగా సదరు సంస్థ తరపున వకల్తా పుచ్చుకున్నారా అనేంతలా వారు మాట్లాడుతున్నారు. ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నారు. దీంతో టీడీపీ ఏమైనా తప్పు చేసిందా అనే అనవసరం అనుమానాలు ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. ప్రజల్లో తమ వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యాయనే అనుమానాలు వచ్చాయి. ఈ విషయంపై విచారణ పూర్తయితే ప్రజల అనుమానాలు కూడా తొలిగిపోతాయి. ఈ వ్యవహారాన్ని ఓన్ చేసుకోవడం, ప్రైవేటు కంపెనీ తరపున వకల్తా పుచ్చుకోవడం వల్ల టీడీపీకి నష్టం కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
No comments:
Post a Comment