Breaking News

14/03/2019

టీడీపీలో ఖుషీ... వైసీపీలో అంతర్మధనం

విజయవాడ, మార్చి 14, (way2newstv.in)
తొలిదశలోనే తెలుగు రాష్ట్రాల ఎన్నికల తంతు ముగించేయాలన్న నిర్ణయం పార్టీల్లో గుబులు రేకెత్తిస్తోంది. సరైన సమయం లేదంటూ అభ్యర్థులు నిట్టూర్పులు విడుస్తున్నారు. అధికారికంగా ఇంకా అభ్యర్థుల ప్రకటన ఏ పార్టీలోనూ పూర్తికాలేదు. నెలలోపుగానే ఎన్నికల తంతు ముగిసిపోనుంది. ఈ కాలవ్యవధిలోపు అన్నిగ్రామాలు కలియతిరగడం, అన్ని వర్గాల ప్రజలను కలవడం అంత సులభం కాదు. ఒక్క తెలుగుదేశం పార్టీని మినహాయిస్తే మిగిలిన పార్టీల్లో నాలుగోవంతు సీట్ల ఎంపిక సైతం పూర్తి కాలేదు. చివరిక్షణాల మార్పులు, చేర్పులపై ఇంకా కసరత్తు కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి 115 మంది అభ్యర్థుల ఎంపిక తర్వాత బ్రేకు పడింది. మిగిలిన చోట్ల అసమ్మతులు, అసంతృప్తులు, బలహీనమైన అభ్యర్థుల బెడద వెన్నాడుతోంది. వైసీపీలో ఇంకా సగం చిట్టా అలాగే ఉంది. నియోజకవర్గాల ఇన్ ఛార్జులు , కన్వీనర్లు రంగంలో ఉన్నప్పటికీ వైసీపీ అధినేత క్లియరెన్సు ఇవ్వలేదు. సిస్టమేటిక్ గా అన్నీ చేయాలనుకున్న జనసేనకు అదంత సులభం కాదన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. గెలవడం సంగతి అటుంచితే కనీసం బలమైన అభ్యర్థులను పోటీకి దింపడమే ఆపార్టీకి గగన కుసుమంగా మారుతోంది. మరొక వారంలో నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఇంకా అధినేతలు కొత్త అభ్యర్థుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. గెలుపు గుర్రాలను వెదుకుతున్నా టైమ్ లేదు. 


టీడీపీలో ఖుషీ... వైసీపీలో అంతర్మధనం


ఈ కొద్ది వ్యవధిలో ఏం చేయగలమనే నిరాశలో మెజార్టీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వారికి ఒకే ఒక విషయం కొంత సంతృప్తిని కలగచేస్తోంది. ఎమ్మెల్యే నియోజకవర్గానికి 25 కోట్ల వరకూ ఖర్చు చేయాల్సి రావచ్చని అంచనా వేసుకున్నాయి ప్రధాన పార్టీలు. ఇందులో ఎంపీ అభ్యర్థి వాటా అయిదు కోట్లు, పార్టీ నుంచి అయిదు కోట్లు అందచేయాలనేది అధికారపార్టీ వేసుకున్న ఎత్తుగడ. మిగిలిన పదిహేను కోట్లు అభ్యర్థులే భరించాలి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీది ఈవిషయంలో భిన్నమైన ద్రక్పథం. ఎంపీ అభ్యర్థులు తాము సొంతంగానే ఖర్చు చేసుకుంటారు. ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తున్నవారు కనీం 20 కోట్లు సొమ్ము చూపిస్తేనే టిక్కెట్టు కేటాయిస్తామంటూ వైసీపీ బేరాలకు దిగుతున్నట్టు బహిరంగ ప్రచారం సాగుతోంది. జనసేనలో అంతగా డబ్బు ప్రభావం కనిపించడం లేదు. అయితే అయిదుకోట్ల మేరకు అయినా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుందంటూ ఆ పార్టీ ఒక స్థూల అవగాహనకు వచ్చేసింది. ఓట్ల కొనుగోలును పక్కనపెట్టినా కార్యకర్తలు, ప్రచారసంరంభానికి రోజుకు పదిలక్షల వరకూ ఖర్చు ఉంటుందని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. ఏ చివరి విడతలోనో ఎన్నికలు పెట్టి ఉంటే కనీసం నాలుగైదు కోట్ల రూపాయలు అదనంగా ఖర్చయి పోయి ఉండేవని విశ్లేషకుల అభిప్రాయం. నెగ్గినా, ఓడినా ప్రస్తుతం ఆ ఖర్చు మాత్రం తగ్గింది.ఈ విడత సామాజిక మాధ్యమాల వార్ పతాక స్థాయికి చేరబోతోంది. అన్నిమార్గాల్లోనూ ప్రకటనలు, ప్రచారం చేయాలనుకుంటున్నప్పటికీ వ్యక్తిగతంగా అందరికీ చేరడానికి సోషల్ మీడియాను మించింది లేదని నాయకులు గ్రహించారు. పార్టీలవారీగా సోషల్ మీడియా సైట్లు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. బూత్ ల స్థాయి కార్యకర్తలకు సైతం సమాచారం అంతా చేరవేస్తున్నారు. నాయకుల నిర్ణయాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నారు. తమ పార్టీ ప్రచారం చేసుకోవడంతోపాటు ప్రత్యర్థి పార్టీని ఎలా ఆటపట్టించాలో కూడా తెలియచెబుతున్నారు. ఇదంతా ఒక వంతు. ఇప్పటికే గుర్తింపు పొందిన సోషల్ మీడియా సైట్లను తమ ప్రచారానికి అనుగుణంగా కొనుగోలు చేయాలనేది పార్టీల నిర్ణయం. ఎన్నికల కమిషన్ సైతం ఈ విషయాన్ని గుర్తించినప్పటికీ కట్టడి చేయడం సాధ్యం కాదు. వేల సైట్లు విచ్చలవిడిగా వెలిసి వివిధ పార్టీల ప్రచారాన్ని పాజిటివ్ గాను, వ్యతిరేకంగానూ కొనసాగిస్తున్నాయి. వాటికి తగు మొత్తం పార్టీల తరఫున చెల్లింపులు సాగిపోతున్నాయి. తమకు అనుకూలంగా ప్రచారం చేయడమే కాదు. ప్రత్యర్థికి ప్రతికూలంగా ప్రచారం చేసినందుకూ తగు మూల్యం చెల్లించడమే ఇప్పుడు కొత్త తంతుగా మారింది. సార్వత్రిక సమరంలో ఎన్నికల యుద్ధంలో మైక్రో మేనేజ్ మెంట్ కు పార్టీలు ప్రాధాన్యమివ్వబోతున్నాయి. గతంలో నియోజకవర్గస్థాయి సభలు, సమావేశాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. నాయకులు పర్యటనలు చేసినా బూత్ స్థాయి ప్రణాళిక తక్కువగా ఉండేది. కొన్నిపార్టీలు మాత్రమే బూత్ ల వారీ పోల్ మేనేజ్ మెంట్ ను పకడ్బందీగా అమలు చేస్తుండేవి. 2019 ఎన్నికల్లో దాదాపు అన్నిపార్టీలు బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. ఓటర్లను పోలింగు బూత్ లకు తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపై బూత్ బాధ్యులకు శిక్షణ కార్యక్రమాలను సైతం నిర్వహించారు. స్వచ్ఛందంగా ఓట్లు వేసే రోజులకు కాలం చెల్లిపోయిందని పార్టీలు భావిస్తున్నాయి. అందువల్ల నగదు పంపిణీ చేయడమే కాదు. దానిని పంచిపెట్టిన కార్యకర్తలే సంబంధిత ఓటర్లను బూత్ లకు తెచ్చే బాధ్యతను తీసుకోవాలనే విధంగా సూచనలిస్తున్నాయి. రాష్ట్ర, జాతీయస్థాయి ఎన్నికలు క్షేత్రస్థాయి సమరాలుగా రూపుదాలుస్తున్నాయి. ప్రతి ఓటూ విలువైనదే. ఫలితాన్ని నిర్దేశించేదే. అందుకే ప్రధాన పార్టీలు ఫీల్డు లెవెల్ ఓట్లపై కులాలు, మతాల వారీగా సైతం వర్గీకరించి పోల్ బూత్ కు తెచ్చేందుకు అవసరమైన కసరత్తును అప్పుడే మొదలు పెట్టేశాయి.

No comments:

Post a Comment