Breaking News

26/03/2019

జగ్గంపేటలో బాబాయ్- అబ్బాయ్ మధ్యే పోటీ

కాకినాడ, మార్చి 26 (way2newstv.in)
తూర్పు గోదావరి జిల్లాలో అన్ని నియోజక వర్గాలు ఒక ఎత్తు… అయితే జగ్గంపేట నియోజకవర్గం మరోఎత్తు. ఇక్కడ పార్టీలు మారతాయి. జెండాలు మారతాయి తప్ప అధికారం మాత్రం ఆ రెండు కుటుంబాల మధ్యే ఉంటుంది. తోట, జ్యోతుల ఈ రెండు కుటుంబాలే మూడు దశాబ్దాల పాటు జగ్గంపేటని ఏలుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో జ్యోతుల కుటుంబంలోనే ఆధిపత్యపోరు నడిచింది. వైసీపీ నుండి పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ…టీడీపీ నుండి పోటీ చేసిన తన సోదరుడు కుమారుడు జ్యోతుల చంటిబాబుపై ఘనవిజయం సాధించారు. అయితే నెహ్రూ గెలిచాక టీడీపీలోకి వచ్చారు…అటు నెహ్రూ ఇటు రావడంతో చంటిబాబు వైసీపీ జెండా కప్పుకున్నారు. సారి ఎన్నికల్లో నెహ్రూ టీడీపీ నుండి..చంటిబాబు వైసీపీ నుండి బరిలోకి దిగారు. దీంతో మరోసారి పోటీలో ఉన్న బాబాయ్-అబ్బాయిలలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. నెహ్రూ తెదేపాలో చేరాక నియోజకవర్గంలో మంచి అభివృద్ధి జరిగింది. పార్టీ పరంగానే కాకుండా నెహ్రూకి సొంత ఇమేజ్ ఉంది. 


జగ్గంపేటలో బాబాయ్- అబ్బాయ్ మధ్యే పోటీ

నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. ప్రభుత్వ సంక్షేమం, ఎన్టీఆర్ ఇళ్ళు, గ్రామాల్లో సి‌సి రోడ్లు, మెరుగైన తాగునీటి సరఫరా వంటి అంశాలతో నెహ్రూకి ప్రజల్లో మంచి మార్కులే పడ్డాయి. అయితే మొన్నటివరకు తెదేపాలో ఉన్న ఎంపీ తోట నరసింహం ఫ్యామిలీకి జగ్గంపేటలో మంచి పట్టు ఉంది. కానీ టికెట్ దొరకపోవడంతో వారు వైసీపీలో చేరారు. దీంతో నరసింహం భార్యకి పెద్దాపురం టికెట్ ఇచ్చారు. కాకపోతే జగ్గంపేటలో ఉన్న తోట అనుచర వర్గం వైకాపాకి సపోర్ట్ చేయడం నెహ్రూకి మైనస్ కానుంది.మరోవైపు చంటిబాబు వైసీపీ కోఆర్డినేటర్‌గా పనిచేస్తూ టికెట్‌ను దక్కించుకున్నారు. మంచి పేరు, రెండుసార్లు ఓడిపోయారన్న సానుభూతి పవనాలు చంటిబాబుకి కలిసిరానున్నాయి. అలాగే తోట కుటుంబం అండదండలు చంటిబాబుకి గట్టిగానే ఉన్నాయి. జగన్ పాదయాత్ర కూడా వైకాపాకి ప్లస్ అవుతుంది. కానీ నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో నడిపిస్తూ అందరి మన్ననలూ పొందుతున్న నెహ్రూపై గెలవడం చంటిబాబుకు అంత సులభం కాదు. ఇక జనసేన నుంచి పాటంశెట్టి సూర్యచంద్రరావు పోటీ చేస్తున్నారు. అతను సర్పంచ్‌గా దేశవ్యాప్త పేరు సంపాదించిన వ్యక్తి. అలాగే ఇక్కడ పవన్ అభిమానులు బాగానే ఉన్నారు. కానీ జనసేనపోటీలో ఉన్నప్పటికీ టీడీపీ- వైసీపీ మధ్యే ప్రధాన పోటీ జరగనుంది. ఈ నియోజకవర్గంలో గోకవరం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాలు ఉన్నాయి. వీటిల్లో జ్యోతుల, తోట కుటుంబాలకి మద్ధతుదారులు బాగానే ఉన్నారు. అయితే ఈసారి తోట అనుచరులు చంటిబాబుకి సపోర్ట్ చేయనున్నారు. అటు ఎలాగో నెహ్రూ ఫాలోవర్స్ కూడా ఎక్కువే. ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువ…అలాగే పోటీ చేసే అభ్యర్ధులు ఆ సామాజికవర్గం వారే. దీంతో ఈసారి కాపుల మద్ధతు ఎక్కువ ఎవరికి ఉంటుందో వారి గెలుపు సునాయసం అవ్వొచ్చు. ఈ సారి బాబాయ్-అబ్బాయ్ పోరు ఇక్క‌డ చాలా ఆస‌క్తిగా ఉంది.

No comments:

Post a Comment