Breaking News

01/03/2019

విజయవాడలో శ్రీభ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు

ఈ నెల 6న రధోత్సవం
విజయవాడ, మార్చి 1, (way2newstv.in)
విజయవాడ పాతబస్తీలోని పాతశివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 8వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, శ్రీ వసంత మల్లిఖార్జున స్వామి వార్ల దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 6న (బుధవారం) సాయంత్రం 5 గంటలకు కెనాల్ రోడ్డులో రధోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బయన హరేశ్వరరావు, బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ తెలిపారు. 


విజయవాడలో శ్రీభ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు

ఈ విషయమై శుక్రవారం ఉదయం కన్యకాపరమేశ్వరి అన్నసత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారిరువురూ మాట్లాడుతూ శ్రీ కనకదుర్గా మల్లేశ్వర, శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర, శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి, శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లిఖార్జున స్వామి వార్లను వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన రధోత్సవాన్ని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారని, ముఖ్య అతిథులుగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఛైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ పాల్గొంటారని తెలిపారు. రధోత్సవంలో విశిష్ట అతిథులుగా నగర మేయర్ కోనేరు శ్రీధర్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), దుర్గగుడి పాలకమండలి సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, బేతాళ నృత్యాలు, మహిళల కోలాటాలు, వేద పండితులు మంత్రోఛ్ఛారణలు, భక్తుల శివనామస్మరణ నడుమ అత్యంత వైభవంగా రధోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. రధోత్సవంలో నగరవాసులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు, రధోత్సవానికి సంబంధించి రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటి పాలకవర్గ సభ్యులు నందిపాటి నారాయణరావు, వల్లంకొండ ప్రసాద్, చల్లా హరినారాయణ, మట్టా వెంకట సుబ్బారావు, డోగిపర్తి శంకరరావు, కాజ యజ్ఞనారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment