Breaking News

11/03/2019

నల్లబజార్ కు అంగన్ వాడీ గ్రుడ్లు

కడప, మార్చి 11, (way2newstv.in)
చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కోడిగుడ్లు అర్హులకు అందనీయకుండా నల్లబజారులో విక్రయించి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొంత మంది అంగన్వాడీ కార్యకర్తలు.. ఉన్నత స్థాయి అధికారులు అవినీతి, అక్రమాలకు చరమగీతం పాడాలని పదే పదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలోని సిబ్బంది, అధికారులు ఎవరేం చెప్పినా మా నెత్తికెక్కదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా స్త్రీ, శిశు సంక్షేమశాఖలోని సిద్దవటం ప్రాజెక్టుకు సంబంధించి మండలాల్లో సరఫరా చేయాల్సిన కోడిగుడ్లు కడప నగరంలో జోరుగా విక్రయిస్తున్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండు నుంచి కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఓ చిరుదుకాణంలో అంగన్వాడీ కోడిగుడ్లు విక్రయిస్తున్నారు. ఈ గుడ్లు సిద్దవటం ప్రాజెక్టు పరిధిలోని ఒంటిమిట్ట మండలం నుంచి వస్తున్నట్లు తెలిసింది. 


 నల్లబజార్ కు అంగన్ వాడీ గ్రుడ్లు

అక్కడ పంపిణీ చేయాల్సిన కోడిగుడ్లను కడప నగరంలో విక్రయిస్తున్నారు. సాధారణ కోడగుడ్డు ధర రూ.5లకు విక్రయిస్తుండగా అదే అంగన్వాడీ కోడిగుడ్డు రూ.10లకు మూడు ఇస్తున్నారు. రెండు రకాల కోడిగుడ్లను దుకాణంలో విక్రయిస్తుండగా స్థానికంగా ముఖ పరిచయం ఉన్న వారికి అంగన్వాడీ కోడిగుడ్లు విక్రయిస్తూ గుట్టు చప్పుడుగా తమ అక్రమ దందా సాగిస్తున్నారు. ఒక్క సిద్దవటం ప్రాజెక్టుకు సంబంధించిన అంశమే గాకుండా నగరంలోని పలు అంగన్వాడీ కేంద్రాల నుంచి కూడా కోడిగుడ్లు ఇతరత్రా అవసరాలకు ఉపయోగిస్తున్నారు. కొంత మంది కార్యకర్తలు తమ ఇళ్లలో వినియోగిస్తుండగా ఇంకొంత మంది దోశల అంగళ్లకు, చిరు దుకాణాలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఆ దిశగా విచారణ చేస్తే కోడిగుడ్ల వ్యవహారం బట్టబయలవుతుంది.అంగన్వాడీ కార్యకర్తల్లో చాలా మంది కడపలో సంసారం ఉంటూ పల్లెల్లో అంగన్వాడీ కార్యకర్తలుగా ఉంటున్నారు. అందులో సిద్దవటం, ఒంటిమిట్ట, వల్లూరు, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె తదితర మండలాల్లో పనిచేసే కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది పల్లెలో గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లను కడపలోని దుకాణాల్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

No comments:

Post a Comment