Breaking News

11/03/2019

అనధికారికంగా కొనసాగుతున్న కరెంట్ కోత

శ్రీకాకుళం, మార్చి 11, (way2newstv.in)
శ్రీకాకుళం జిల్లాలో అనధికారికంగా కరెంట్ కోత ప్రారంభమైంది.మొత్తం 7.53 లక్షల గృహావసర  కనెక్షన్లతో పాటు వాణిజ్య అవసర ఇతరత్రా కనెక్షన్లు కలిపి మొత్తం 7.90 లక్షలు ఉన్నాయి. మార్చి నెల ప్రారంభం నుంచి జిల్లాలో విద్యుత్‌ వినియోగం రోజుకు 50 లక్షల యూనిట్లు  ఉంటోంది. గత ఏడాది వేసవి కాలం ఏప్రిల్‌ నెల మొత్తం 127 ఎంయూ విద్యుత్‌ వినియోగం కాగా, మే నెలలో అది 136 ఎంయూకి చేరింది. సగటున రోజుకు దాదాపు 44 లక్షల యూనిట్లు ఉండేది. కానీ ఈసారి మాత్రం ఉష్ణోగ్రతలు మార్చి ప్రారంభం నుంచే ఎక్కువయ్యాయి. రాత్రిపూట చల్లని వాతావరణం ఉన్నప్పటికీ పగటిపూట అధిక ఉష్ణోగ్రత వల్ల ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రిపూట ఉక్కపోత పెరుగుతోంది. మరోవైపు జిల్లాలో ఏసీల వినియోగం కూడా ఏటా అధికమవుతోంది. దీంతో విద్యుత్‌కు డిమాండు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. అంటే సగటున రోజుకు 50 లక్షల యూనిట్లకు మించి విద్యుత్‌ అవసరం ఉంటుంది. 


అనధికారికంగా కొనసాగుతున్న కరెంట్ కోత


ఈలెక్కన నెలకు 150 ఎంయూల వరకు వినియోగానికి అవకాశం ఉందని విద్యుత్‌ శాఖ అంచనాలు వేస్తోంది. ఈమేరకు డిమాండ్‌కు తగినట్లు సరఫరా ఇవ్వగలమని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చూస్తే భిన్నంగా ఉన్నాయి.విద్యుత్‌ శాఖ పరిధిలో ప్రస్తుతం పలుచోట్ల మరమ్మతులతో పాటు కొన్నిచోట్ల అభివృద్ధి పనులు జరుగుతుండటంతో విద్యుత్‌ సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఎల్‌ఈడీల ఏర్పాటు లక్ష్యంగా థర్డ్‌ వైర్‌ను ఇంకా 31 మండలాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 310 పంచాయతీల్లోనూ, టెక్కలి డివిజన్‌లో 171 పంచాయతీల్లో థర్డ్‌ వైర్‌ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జిల్లా కేంద్రం శ్రీకాకుళంతో పాటు పలుచోట్ల స్తంభాలు, కొత్తగా కండక్టర్ల మార్పు పనులు చేస్తున్నారు. ఈ పేరుతో ఆయా ప్రాంతాల్లో గంటల తరబడి సరఫరాను నిలిపివేస్తున్నారు. వాస్తవానికి ఎలాంటి మరమ్మతు పనులైనా శుక్రవారం, ఆదివారాల్లోనే చేయాలని సీఎండీ కార్యాలయం నుంచి ప్రత్యేక ఆదేశాలు ఉన్నాయి. అయినా స్థానిక అధికారులు వాటిని అమలు చేయట్లేదనే చెప్పాలి. అసలే పరీక్షల సమయంలో రోజంతా విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడంతో విద్యార్థులు, వినియోగదారులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. రైతులు కూడా వ్యవసాయ పంపుసెట్లు పనిచేయక పొలానికి నీరు అందట్లేదని ఆవేదన చెందుతున్నారు. పైడిభీమవరం, నవభారత్‌ వంటి ప్రారిశ్రామిక వాడల్లోనూ విద్యుత్తు అప్రకటిత కోతలతో ఇబ్బందులు తప్పట్లేదు.

No comments:

Post a Comment