Breaking News

11/03/2019

గోదావరి నీటిని దోచేస్తున్నారు..

రాజమండ్రి, మార్చి11, (way2newstv.in
సాగు, తాగు నీటి కోసం యుద్ధాలే జరుగుతున్న ప్రస్తుత కాలంలో ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లోని పలు పరిశ్రమల పాలిట గోదావరి నది జీవనవాహినిగా మారింది. పరిశ్రమలకు నీటి అవసరాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. అంతేకాదు పరిశ్రమల మనుగడకు అత్యావశ్యకమైన ఈ జీవ జలాలు అత్యంత చౌకగా అందుతున్నాయి. పూర్వం ఎపుడో నిర్ణయించిన ధరలకే నేటికీ జలాలను పొందుతున్న వైనం కన్పిస్తోంది. లీటర్ మంచినీటి బాటిల్ రూ.20కు కొనుగోలు చేసుకుంటుంటే, శుద్ధిచేయని గోదావరి జలాలు మాత్రం 1000 గ్యాలన్లు గరిష్ఠంగా రూ.4.50కే కేటాయిస్తున్నారు. గోదావరి హెడ్ వర్క్సు డివిజన్, గోదావరి తూర్పు డివిజన్, వైఆర్‌సీ డివిజన్, వైఐడివిజన్, డ్రైయినేజీ, గోదావరి సెంట్రల్ డివిజన్ పరిధిలో వివిధ పరిశ్రమలకు నీటిని కేటాయించారు. ఇందులో గోదావరి తూర్పు డివిజన్ పరిధిలో అత్యధిక పరిశ్రమలకు పారిశ్రామిక అవసరాలకు గోదావరి జలాలను వినియోగిస్తున్నారు. 


గోదావరి నీటిని దోచేస్తున్నారు..


వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇటు తాగునీటి అవసరాలకు వేసవి కాలంలో సరిపడే నీటిని సమ్మర్ స్టోరేజి ట్యాంకులను నింపే ప్రక్రియను ఏప్రిల్ మాసంలో చేపట్టనున్నారు.అదే సమయంలో పారిశ్రామిక అవసరాలకు ఆయా సమ్మర్ స్టోరేజి ట్యాంకులను పూర్తి స్థాయిలో నింపుకుంటారు. ఏప్రిల్ మూడో వారంలో కాల్వలను మూసివేస్తారు. జిల్లాలో భారీ పరిశ్రమలకు ప్రత్యేక స్టోరేజీలు వున్నాయి, చిన్న చిన్న పరిశ్రమల అవసరాలకు వేసవిలో ఇతర స్టోరేజీ ట్యాంకులపై ఆధారపడి నీటి అవసరాలు సమకూర్చుకుంటాయి.గోదావరి జిల్లాల్లోని పరిశ్రమలకు 1997కు ముందు కేటాయించిన పరిశ్రమలకు 1000 గ్యాలన్లు రూపాయిన్నర నుంచి మూడు రూపాయల వరకు వుంటే, ఆ తర్వాత వచ్చిన పరిశ్రమలకు 1000 గ్యాలన్లు రూ.4.50కు ప్రభుత్వం కేటాయించింది.గోదావరి నది నుంచి నేరుగా కొన్ని పరిశ్రమలు పైపులైన్ ద్వారా నీటిని వినియోగించుకుంటుంటే, మరికొన్ని పరిశ్రమలకు గోదావరి డెల్టా కాల్వల నుంచి నీటిని కేటాయించారు. ఇవికాకుండా విశాఖపట్నం పారిశ్రామిక అవసరాలకు విస్కో పైపులైన్ ద్వారా నేరుగా గోదావరి నది నుంచి నీటిని వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఏలేరు రిజర్వాయర్ నుంచి కూడా విశాఖ పారిశ్రామిక అవసరాలకు జలాలు పంపిణీ అవుతున్నాయి. ఎస్‌ఈజడ్‌లకు కూడా పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా నీటిని కేటాయించారు. దాదాపు 24 టిఎంసీల జలాలను పోలవరం ద్వారా పరిశ్రామిక అవసరాలకు కేటాయించారు గోదావరి తూర్పు డెల్టా పరిధిలో మొత్తం 17 పరిశ్రమలకు 129.837 క్యూసెక్కులు వెయ్యి గ్యాలన్లు రూ.4.50 చొప్పున కేటాయించారు. కాకినాడలోని ఓఎన్జీసీ గోదావరి సెంట్రల్ డివిజన్ పరిధి నుంచి 10 ఏళ్ళ కాలం పాటు 1000 గ్యాలన్లు రూ.4.50 చొప్పున 0.123 క్యూసెక్కులకు అనుమతి పొందింది. మొత్తం మీద గోదావరి నుంచి 82104.250 క్యూసెక్కులు పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకుంటున్నాయి.గోదావరి తూర్పు డెల్టా పరిధిలో పలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కూడా వెయ్యి గ్యాలన్లు రూ.4.50కు కేటాయించారు. జీవీకే ఇండస్ట్రీస్, రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్, గౌతమి పవర్ లిమిటెడ్, స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ లిమిడెట్ తదితర సంస్థలు, ఎరువులు ఫ్యాక్టరీలు గోదావరి జలాలను సమ్మద్ధిగా వినియోగించుకుంటున్నాయి. పారిశ్రామిక నీటి అవసరాలకు గోదావరి నదే ఆధారభూతంగా వుంది.

No comments:

Post a Comment