Breaking News

11/03/2019

సెంటిమెంట్ అస్త్రాన్ని బయిటకు తీసిన బాబు

విజయవాడ, మార్చి11, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. వచ్చే ఎన్నికల్లో తనకు, కేసీఆర్ కు మధ్య మాత్రమే పోటీ అని చెప్పి సెంటిమెంట్ ను రగిలించే దిశగా ఎన్నికలకు వెళ్లదలచుకున్నారు. డేటా చోరీ అంశాన్ని కూడా ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపెట్టి ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. డేటా చోరీ కేసులో ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రమే తమ పార్టీకి చెందిన డేటాను చోరీ చేసిందని చెబుతూ వస్తున్న ఆయన తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూచన మేరకే ఏపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ కక్ష్య సాధింపు చర్యలకు దిగుతుందంటున్నారు.ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఇదే సెంటిమెంట్ తో వెళ్లి విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లేనని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులు సయితం ముందుకు సాగవని చెప్పారు. మరోసారి పెత్తనాన్ని ఆంధ్రవాళ్లకు అప్పగిస్తారా? అని కేసీఆర్ పలు ఎన్నికల మీటింగ్ లలో పదే పదే ప్రశ్నించి తెలంగాణ ప్రజలను ఆకట్టుకోగలిగారు.


 సెంటిమెంట్ అస్త్రాన్ని బయిటకు తీసిన బాబు

ఇప్పుడు చంద్రబాబు సయితం కేసీఆర్ స్టయిల్ లోనే ఎన్నికలకు వెళ్లాలనుకున్నట్లుంది. రానున్న కాలంలో ఉద్యమ సమయంలో, రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ ఆంధ్రుల మీద చేసిన కామెంట్స్ ను మరోసారి రివైండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ జగన్ కు ఓటేస్తే కేసీఆర్ కు ఓటేసినట్లేనని చెప్పడమే కాకుండా, జగన్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఏపీపై పెత్తనం చేస్తారని ఆయన చెబుతున్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఒక్కటై సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమయిందంటున్నారు. అలాగే తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఐదు వందల కోట్లు నిధులు ఇచ్చారని టీఆర్ఎస్ ప్రచారం చేసింది. అదే తరహాలో ఇప్పుడు చంద్రబాబు కూడా జగన్ కు కేసీఆర్ వెయ్యి కోట్లు పంపారని చెబుతున్నారు.తెలుగుదేశం పార్టీలో కొంత అయోమయ వాతావరణం కన్పిస్తోంది. డేటా చోరీ కేసుకు, ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధమేంటన్నది ఎవరీకి అర్థం కావడం లేదు. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారం. అంతేకాదు ఒక ప్రయివేటు ఐటీ సంస్థపై తెలంగాణ పోలీసులు అక్కడ వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. అయితే దీన్ని ఆంధ్రుల ఆత్మగౌరవంగా చంద్రబాబు అభివర్ణించడాన్ని మేధావులు సయితం తప్పుపడుతున్నారు. ఈ ఆత్మగౌరవాన్ని మోదీతో నాలుగున్నరేళ్లు కలసి ఉన్నప్పుడు ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో కన్పించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకూ తెలుగువాళ్లమంతా ఒక్కటేనని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఐదుకోట్ల ఆంధ్రులంటూ నినాదం ఎత్తుకోవడం విశేషం. మొత్తం మీద చంద్రబాబు తన చివరి అస్త్రాన్ని బయటకు తీసినట్లే కన్పిస్తుంది. మరి ఇందులో సక్సెస్ అవుతారా? లేదా? అన్నది చూడాలి

No comments:

Post a Comment