Breaking News

01/03/2019

అభినందన్‌కు స్వాగతం పలకడానికి సరిహద్దుకు చేరుకున్న ప్రజలు

అభినందన్‌  తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపిస్తామన్న భారత్‌ 
                      నిరాకరించిన పాక్‌
న్యూఢిల్లీ మార్చ్ 1 (way2newstv.in)
పాక్‌ అదుపులో ఉన్న భారత వింగ్‌ కమాండర్ అభినందన్‌ రాక కోసం యావత్‌ భారతం ఎదురుచూస్తోంది. అభినందన్‌కు స్వాగతం పలకడానికి భారత బలగాలు వాఘా సరిహద్దు వద్ద ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం అతన్ని భారత్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో శుక్రవారం ఉదయమే ప్రజలు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పంజాబ్‌ పోలీసు బలగాలను అక్కడ మొహరించారు. అటు అమృత్‌సర్‌లోనూ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.కాగా భారత సరిహద్దు బలగాలతో పాటు వాయుసేన అధికారులు కూడా వాఘాకు చేరుకోనున్నట్లు సమాచారం.  పాకిస్థాన్‌ అదుపులో ఉన్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపించేందుకు భారత్‌ ప్రయత్నించినట్లు సమాచారం. 



అభినందన్‌కు స్వాగతం పలకడానికి సరిహద్దుకు చేరుకున్న ప్రజలు 

అయితే.. అందుకు పాక్‌ నిరాకరించిందట. పాక్‌ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా దిల్లీకి తీసుకొచ్చి ఆయనకు వెంటనే వైద్య చికిత్స అందించాలని భారత్‌ భావించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఐఏఎఫ్‌కు చెందిన విమానాన్ని పంపిస్తామని అందులో అభినందన్‌ను పంపించాల్సిందిగా పాక్‌ను కోరింది. కానీ అందుకు పాక్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. రోడ్డు మార్గం ద్వారా వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను అప్పగిస్తామని తెలిపింది.అభినందన్‌ను ఆహ్వానించేందుకు వాఘా సరిహద్దు వద్ద భారీగా ప్రజలు చేరుకుంటారని దీని వల్ల భద్రతా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున వాయు మార్గంలో ఆయన్ను భారత్‌ తీసుకురావాలని అనుకున్నారు. పాక్‌ అదుపులో ఉన్న అభినందన్‌ను అప్పగిస్తామని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్‌లోని భారత్‌ హైకమిషన్‌ కార్యాలయం ఇప్పటికే అభినందన్‌ అప్పగింతకు సంబంధించిన పత్రాలను పూర్తి చేసి వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు మధ్య అభినందన్‌ వాఘా సరిహద్దుకు చేరుకునే అవకాశం ఉంది. అభినందన్‌కు స్వాగతం పలికేందుకు ఐఏఎఫ్‌ బృందం ఇప్పటికే వాఘా చేరుకుంది.

No comments:

Post a Comment