Breaking News

22/03/2019

కట కట మొదలైంది.. (ఖమ్మం)

ఖమ్మం, మార్చి 22  (way2newstv.in): 
వేసవితాపం ప్రారంభమైంది.. భానుడు ప్రతాపం చూపుతుండడంతో దాహం కేకలు పెరుగుతున్నాయి.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఇక్కట్లు షురూ అయ్యాయి. ఉభయ జిల్లాల్లో పాల్వంచ మినహా ఎక్కడా కూడా ప్రతిరోజు మంచినీరు సరఫరా కావడం లేదు. రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోంది. ప్రస్తుతం పట్టణాల్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తాగునీటి ఎద్దడి రాన్రాను విస్తరించే అవకాశాలున్నాయి. పాలకులు, అధికారులు స్పందించి ముందస్తు చర్యలు తీసుకొంటేనే వేసవిలో పరిస్థితి మెరుగవుతుంది. పట్టణ ప్రాంతాల్లో వేసవి ప్రణాళిక రూపొందించినా వాటికి సంబంధించిన నిధులు మంజూరు కావాల్సి ఉంది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని నగర పాలక సంస్థ, పురపాలక సంఘాల్లో  తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్‌, మధిర, వైరా, సత్తుపల్లి పురపాలక సంఘాలు ఉండగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు పురపాలక సంఘాలుగా విస్తరించాయి. ఇల్లెందు, మణుగూరు పట్టణాల్లో సింగరేణి కొంత వరకు తాగునీటి సరఫరాకు సాయం చేస్తోంది. ఖమ్మం నగరంలో పైపులైను పనులు పూర్తయితే తాగునీటి ఎద్దడి శాశ్వతంగా పరిష్కారమవుతుంది. 


కట కట మొదలైంది.. (ఖమ్మం)

ఖమ్మం నగర పరిధిలో వేసవి ప్రణాళిక రూ.1.4 కోట్లుగా తయారు చేశారు. మిగతా పురపాలక సంఘాల పరిధిలో రూ.5 లక్షల నుంచి వేసవి ప్రణాళిక రూపొందించి అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ట్యాంకర్‌ల ద్వారా సరఫరా చేయాలని సంకల్పిస్తున్నారు. అయితే ఆయా పురపాలక సంఘాల అధికారులు వేసవి కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కిస్తామని పేర్కొంటున్నారు.
కొత్తగూడెం పురపాలక సంఘం పరిధిలో రోజు విడిచి రోజు తాగునీటి సరఫరా చేస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు రూ.9 లక్షలతో ప్రణాళిక రూపొందించారు. రామవరం, మేదరబస్తీ, రామాటాకీస్‌ తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటోంది. జిల్లా కేంద్రం అయినప్పటికీ తాగునీటి సమస్య మాత్రం తీరడంలేదు. పాల్వంచలో నిత్యం తాగునీటి సరఫరా అవుతోంది. గాజులగూడెం, శేఖరంబంజారా, వేటచెరువు, వనమా కాలనీ, గాంధీనగర్‌, మసీదుగుట్ట, శ్రీనగర్‌ కాలనీ తదితర చోట్ల ప్రస్తుతానికి తాగునీటి సమస్య ఉంది. ఏప్రిల్‌, మేలో మరింత ఇబ్బంది రానుంది. రూ.5 లక్షలతో వేసవి ప్రణాళిక రూపొందించారు. పైపులైను లీకేజీ సమస్య నివారణ, చేతిపంపుల్లో ఫ్లషింగ్‌ చేయించాలని నిర్ణయించారు. ఈ విషయమై కమిషనర్‌ శఫీవుల్లాఖాన్‌ వివరణ కోరగా.. నిధులు రాగానే తాగునీటి సమస్యలేకుండా చూస్తామన్నారు.
మణుగూరులో రెండు రోజులకోసారి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. అది కూడా ఒక గంట మాత్రమే వస్తుంది. ఆ గంట సమయంలో ఏమాత్రం ఏమరపాటు వహించినా తాగునీటి ఇబ్బందులు తప్పవు. రూ.23 కోట్లతో తాగునీటి పథకం ప్రారంభించినా ఆచరణలో ఏడాదిన్నరగా నిరుపయోగంగానే ఉంది.  ఈ విషయమై కమిషనర్‌ రామన్న వివరణ కోరగా.. గుత్తేదారు చిన్నపాటి మరమ్మతులు చేయాలని పిలిచినా రావడంలేదు. దీంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. నీటి ఎద్దడి నివారణ రానున్న రోజుల్లో ఏర్పడితే ట్యాంకర్లతో సరఫరా చేస్తామంటున్నారు.
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరా పైపులైను చాలాఏళ్ల కిందట ఏర్పాటు చేయడంతో తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. లీకేజీ మరమ్మతులకే ఏటా  రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. స్టేషన్‌బస్తీ, నంబర్‌ 14, 15 బస్తీ, వెంగళరావుకాలనీ తదితర చోట్ల తాగునీటి సమస్య ఏర్పడుతోంది. ఏప్రిల్‌, మేలో మరింత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.
ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా అవుతోంది. త్రీటౌన్‌ పూర్తిగా, విలీన పంచాయతీలలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రూ.1.4 కోట్లతో వేసవి ప్రణాళిక రూపొందించారు. రోజుకు ఒక్కో వ్యక్తి 150 లీటర్లు కావాలి. సరఫరా మాత్రం 110 లీటర్లు మాత్రమే వస్తోంది. మిషన్‌ భగీరథ పైపులైను పూర్తి చేసుకుంటే తాగునీటి సమస్య తీరనుంది. నగర పాలక సంస్థ పరిధిలో నీటి వనరులు ఉన్నప్పటికీ సరఫరా పైపులైను లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఉన్న పైపులైన్లు పాతవి కావడం కూడా ఇబ్బందిగా మారింది.
సత్తుపల్లిలో ప్రస్తుతానికి పెద్దగా తాగునీటి సమస్యలేదు. రానున్న రోజుల్లో తాగునీటి ఇబ్బందులు పొంచి ఉన్నాయి. జలగంనగర్‌, జవహర్‌నగర్‌, జంగాల కాలనీ, ద్వారకాపూర్‌కాలనీ, కాల్వవోడ్డు, ఎన్టీఆర్‌నగర్‌, గాంధీనగర్‌లో సమస్య వచ్చే అవకాశం ఉంది. రూ.5 లక్షలతో వేసవి ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం రెండు ట్యాంకర్‌లు అందుబాటులో ఉన్నాయి. మరో ట్యాంకర్‌లు అందుబాటులోకి తెచ్చి నాలుగు ట్యాంకర్‌లతో తాగునీటిని సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఈ విషయమై కమిషనర్‌ వెంకన్న వివరణ కోరగా.. మున్సిపాలిటీ పరిధితో సరఫరా చేసే నీటిపైన జనం ఆధారపడుతున్నారు. వ్యక్తిగత బోర్లు లేకపోవడంతో ఈ సమస్య వస్తోంది. వేసవిలో నీటి తీవ్రత లేకుండా చూస్తామంటున్నారు.
మధిర పట్టణంలో ప్రస్తుతం రెండు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోంది. ఎంప్లాయిస్‌ కాలనీ, ముస్లింకాలనీ, వరదరాఘవాపురం, హనుమాన్‌ కాలనీలో తాగునీటి సమస్యలున్నాయి. ఏప్రిల్‌, మే సమయానికి వీటికితోడు రాజీవ్‌నగర్‌, ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాల్లో కూడా సమస్యలు ఏర్పడుతున్నాయి. వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.10 లక్షలతో ప్రణాళిక రూపొందించారు. వాటర్‌ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. దీనిపై కమిషనర్‌ దేవేందర్‌ వివరణ కోరగా.. వేసవిలో తాగునీటి ఆటంకాలు ఏర్పడకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామంటున్నారు.
వైరాలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. వారానికి ఒకసారి కూడా తాగునీరు వచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం.. కొన్నేళ్ల కిందట వేసిన పైపులైను ద్వారానే సరఫరా ఇస్తున్నారు. వైరాలో జనాభా, కుటుంబాల సంఖ్య పెరిగినా వాటికి అనుగుణంగా పైపులైను వ్యవస్థను ఆధునికీకరణ చేయలేదు. దీనికి తోడు ట్యాంకులు కూడా పరిమితంగా ఉన్నాయి. వేసవిలో ఏ చిన్న సమస్య వచ్చినా పది నుంచి పదిహేను రోజుల వరకు సమస్య పరిష్కారం కావడంలేదు. ఏటేటా స్థానికులకు ఆందోళన తప్పడంలేదు.

No comments:

Post a Comment