Breaking News

27/03/2019

విషాదం గా మారుతున్న విహారం

ఐదేళ్లలో 204 మంది మృతి
వైజాగ్, మార్చి 27, (way2newstv.in)
వేసవి కాలం వస్తుందంటే చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా కుటుంబ సమేతంగా అందరూ కలిసి విహార యాత్రలకు వెళ్తుంటారు. ఆనందంలో తేలియాడే క్రమంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించరు. ఆ ఏమరపాటే కుటుంబాల్లో పెద్ద విషాదాన్ని మిగల్చొచ్చు. అందుకే వేసవి విహార యాత్రలకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్‌ పరీక్షలు పూర్తి కాగా, పది, డిగ్రీ పరీక్షలు ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్‌ 24 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఎండలు మండిపోతున్నా విహార యాత్రలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎండాకాలంలో సముద్రతీరం చల్లగా ఉంటుందన్న ఆలోచనతో విశాఖ పట్టణాన్నే పలువురు విహార యాత్రకు కేంద్రంగా ఎంచుకుంటారు. ఆనందం వెనుక విషాదాన్ని గమనించని యువత, చిన్నపిల్లలు సముద్ర స్నానాలకు దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. రక్షణ చర్యలు అంతంత మాత్రంగానే ఉండటం, ఈత సరదాతో ప్రమాదాన్ని గుర్తించకపోవడం ఈ ప్రమాదాలకు కారణాలు. విశాఖపట్నం సాగరతీరం ప్రమాదకరంగా మారుతోందా అంటే అవుననే చెప్పాలి. పోలీసుల నిర్లక్ష్యం.. హెచ్చరికబోర్డులు లేకపోవడం.. ఈత సరదా వెరసి చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. 30 కిలోమీటర్ల సాగర తీరంలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 


విషాదం గా మారుతున్న విహారం

ఇన్ని ప్రమాదాలు జరిగి వందలాది మంది ప్రాణాలను కోల్పోతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయడం లేదు. ఫలితంగా ఈత సరదా చాలా మందిని బలిగొంటోంది. ప్రమాదంలో ఉన్న వారిని రక్షించేందుకు కూడా సరిపడా సిబ్బంది లేకపోవడం.. ఉన్నవారికి రక్షణగా ఎటువంటి పరికరాలూ లేకపోవడం కూడా ఇబ్బందిగా మారుతోంది. దీంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు.స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం అందాలను వీక్షించేందుకు ఏడాదికి దేశ, విదేశాల నుంచి సుమారు 1.30 కోట్ల మంది పర్యాటకులు వస్తున్నట్లు పర్యాటక శాఖ అంచనా వేస్తోంది. ఇందులో సగానికి పైగా జనం సాగర తీరంలో సేదతీరుతుంటారు. ఎక్కువ మంది సముద్ర స్నానాలకు మక్కువ చూపుతుంటారు. ముఖ్యంగా నిత్యం ప్రజలతో రద్దీగా కనిపించే ఆర్కే బీచ్‌లో వరుస ఘటనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత ఆదివారం సాయంత్రం ముగ్గురు యువకులు గల్లంతవడం.. అందులో ఒక యువకుడు మృతి చెందండం తెలిసిందే. వారానికి ఒకరైనా సముద్రంలో పడి మృతి చెందడం పరిపాటిగా మారింది. వేసవి సెలవులు కావడంతో చాలా మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి సముద్ర తీరానికి వచ్చి సేదతీరుతుంటారు. ఇందులో కొంత మంది ఈత సరదా మీద సముద్రంలోకి దిగి ప్రాణాలను కోల్పోతున్నారు. ఎక్కడ ప్రమాదఘంటికలున్నాయో అక్కడ హెచ్చరిక బోర్డులను పెట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సముదం లోతు అంచనా వేయని యువకులు లోపలికి దిగి ఎగసిపడుతున్న కెరటాలకు బలవుతున్నారు.విశాఖ సాగర తీరం 30 కిలోమీటర్ల పొడవు ఉంటుందని అంచనా. ఇంత విస్తీర్ణం కలిగిన సముద్ర తీరాన కేవలం ఆరుగురు పోలీసులు మాత్రమే గస్తీ కాస్తున్నారు. ఇందులో కొంత మంది నగరానికి ప్రముఖులు వచ్చినపుడు బందోబస్తుకు వెళ్లిపోతుంటారు. మిగిలిన ఇద్దరో, ముగ్గురో అక్కడ ఉండి వారికి కనిపించిన వారికి హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఒక చోట ప్రమాదం జరిగిందని తెలుసుకుని ఈ పోలీసులు అక్కడకు చేరుకోవాలంటే తీరాన నడిచి వెళ్లాలే తప్ప వారికి ఎటువంటి వాహనాలూ లేవు. దీంతో వీరు అక్కడకు చేరుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. గజ ఈతగాళ్లు ఉన్నప్పటికీ నీటిలో మునిగిన వారిని రక్షించేందుకు వారికి సరిపడా పరికరాలు లేవు. ఒక వేళ రక్షించినా ఒక వ్యక్తి ఒక్కరినే రక్షించగలడు. అదే చిన్నచిన్న బోట్లు ఉంటే ఒకే వ్యక్తి ఐదుగురుని రక్షించగల అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో కొంతమంది సముద్రానికి దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు పూర్తిగా మరమ్మతులకు గురయ్యాయి. కొన్ని చోట్ల కనిపించడం లేదు. ఈ ఐదేళ్ల వ్యవధిలో 204 మంది సముద్రానికి బలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత హోలీ పండగ సందర్భంలో కూడా స్థానిక జాలారి పేటకు చెందిన ఇద్దరు యువకులు సముద్రంలో గల్లంతయ్యి చనిపోయారు. అయినా పోలీసులు గుణపాఠం నేర్వలేదు. 2012లో గీతం కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు సముద్ర కెరటాలకు బలవ్వడంతో అప్పట్లో ప్రభుత్వం సీరియస్‌ అయినా తరువాత మరిచిపోయింది. దీంతో పోలీసుల నిర్లక్ష్యం మరింత పెరిగిపోయింది. గతేడాది డిసెంబరులో వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు యువకులు రుషికొండ బీచ్‌లో గల్లంతయ్యారు. గత ఆదివారం ఉగాదిని పురష్కరించుకుని ముగ్గురు స్నేహితులు సముద్ర స్నానాలకు దిగి ఆర్కే బీచ్‌ వద్ద గల్లంతయ్యారు. ఇటీవల ఆరిలోవకు చెందిన ఇద్దరు యువకులు కూడా జోడుగుళ్ల పాలెం బీచ్‌ వద్ద ఈత సరదాతో సముద్రంలో దిగి మృతి చెందారు. అయినా పోలీసులు రక్షణా చర్యలు తీసుకోవడం లేదు. 

No comments:

Post a Comment