Breaking News

20/03/2019

గ్లామర్ పాలిటిక్స్

హైద్రాబాద్, మార్చి 20, (way2newstv.in)
ప్రస్తుతం రాజకీయం రంగుల సినిమా అయింది. దేశంలో ఎక్కడి రాజకీయాల్లో అయినా సినీ తారల సందడి నెలకొన్నది. సినీ ఆర్టిస్టులకు ప్రచార బాధ్యతలు అప్పగించడం, వాళ్లతో పాటలు పాడించడం. ఉపన్యాసాలు చెప్పించడం గత ఏడెనిమిది ఎన్నికలుగా ట్రెండ్‌గా మారింది.  ఇప్పుడు సినీతారలనే పోటీలోకి దింపడం అధికమైంది. సినిమా నటీనటులు ఎన్నికల్లో పాల్గొనడం, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా ఎన్నికవడం 1961 నుంచి కొనసాగుతున్నది. ఇప్పుడు ఈ ధోరణి మరీ ఎక్కువైంది. సినిమాల్లో అవకాశాలు తగ్గడమో.. తటస్థంగా ఉండటమో అయినప్పుడు అటోమేటిగ్గా నటీనటుల దృష్టి రాజకీయాలవైపు మళ్లుతున్నది. వాళ్ల గ్లామర్‌ను ఎరగా చేసుకొని పబ్బం గడుపుకోవడానికి పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సినీనటులు సందడి చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో సినీతారలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం పాతమాటే.. 1961లోనే తమిళనాడులో సినీవాసనలు గుబాళించాయి. అప్పుడు ముఖ్యమంత్రి అయిన అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత ఇలా ఒక పెద్ద జాబితాయే తయారవుతుంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా తమిళనాడును సినిమారంగం నుంచి వచ్చినవారే ఏలుతున్నారు. ఇప్పుడు మరోనటుడు కమల్‌హాసన్ కూడా పొలిటికల్ ఎరీనాలోకి ఎంటరయ్యారు. 



గ్లామర్ పాలిటిక్స్

అదేబాటలో ఆంధ్రప్రదేశ్‌లోనూ సినీనటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వచ్చారు. వారిలో విజయం సాధించింది ఎన్టీఆర్ మాత్రమే. మిగతావాళ్లు ఒకసారి ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో ఎన్నికై.. ఆ తర్వా త రాజకీయాల నుంచి తప్పుకున్నవారే. ఎన్టీఆర్ మాత్రమే కాం గ్రెస్ గుత్తాధిపత్యాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడేండ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో భారీ సెట్టింగ్‌లతో మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయింది. 2014 నుంచి పవన్ కల్యాణ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఐదుగురు సినీతారలను బరిలోకి దింపింది. ఉత్తరాది రాష్ర్టాల్లో పలుచోట్ల సినీతారలు ఎన్నికల్లో పోటీపడుతున్నారు. రాజ్‌బబ్బర్, హేమమాలిని, వినోద్‌ఖన్నా, అమితాబ్‌బచ్చన్ వంటివారు దశాబ్దాలుగా రాజకీయాల్లో పనిచేశారు. వీరిలో వినోద్‌ఖన్నా మరణించగా, అమితాబ్‌కు రాజకీయాలు సరిపడలేదు. రాజ్‌బబ్బర్, హేమమాలిని ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలిగారు. 2004 నుంచి మమత పార్టీ తరఫున సినీతారలు పోటీచేయడం, ప్రచారం చేయడం జరుగుతున్నది. అప్పుడు ఐదుగురు సినీతారలు ఎన్నికల్లో పోటీచేసి ఘనవిజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో జాదవ్‌పూర్ నుంచి బెంగాలీ నటి మిమి చక్రవర్తి పోటీచేస్తున్నారు. మరో సినీనటి నుస్రత్ జహాన్ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హాట్ స్థానం నుంచి పోటీచేయనున్నారు. ఈ స్థానంలో 2014 సిట్టింగ్ ఎంపీ ఇద్రిస్ అలీకి మమత టికెట్ నిరాకరించారు. వీరిద్దరితోపాటు సిట్టింగ్ ఎంపీ దీపక్ అధికారి (దేవ్), శతాబ్దిరాయ్, మున్‌మున్ సేన్ కూడా ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. మున్‌మున్ సేన్‌కు బంకురా కేటాయించినప్పటికీ, ఆమె అసన్‌సోల్ నుంచి పోటీచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. బంకూరా నుంచి ప్రముఖ గాయకుడు, సిట్టింగ్ ఎంపీ బాబుల్ సుప్రియో బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మోదీ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. రూపాగంగూలీ కూడా బీజేపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

No comments:

Post a Comment