Breaking News

09/03/2019

తెలంగాణలో 200కు పైగా కరువు మండలాలు

పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
హైద్రాబాద్, మార్చి 9, (way2newstv.in)
మూడేండ్లుగా కరువు మండలాలను అధికారికంగా ప్రకటించక పోవటంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కోల్పోవలసి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కరువు మండలాలను ప్రకటిస్తేనే కేంద్రం నుంచి సకాలంలో సహాయం అందుతుంది. 50 శాతం కంటే తక్కువగా పంట దిగుబడి రావటం, వలసలు, తాగునీరు. పశువుల దాణా కొరత వంటి అంశాల ప్రాతిపదికగా ఎన్ని నిదులు అవసరమో కేంద్రానికి ప్రతిపాదన పంపితే కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేస్తుంది. 2014-15 లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కరువు నివేదికను పంపించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో పంట నష్టం రూ. 4,500 కోట్లు జరిగిందని కేంద్రానికి నివేదిక పంపితే కేంద్రం రూ. 791 కోట్లు సాయంగా విడుదల చేసింది. ఇది కాకుండా 14 వ ఆర్థిక సంఘం మరో రూ. 271 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత వరుసగా మూడేండ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం కరువు నివేదికను పంపలేదు. దేశంలోనే ధనిక రాష్ట్రంగా ప్రకటించుకున్నందుకే కరువు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయటం లేదా అనే సందేహం రాష్ట్రంలో రైతులకు కలుగుతున్నది. 


తెలంగాణలో 200కు పైగా కరువు మండలాలు

రాష్ట్ర వ్యాప్తంగా మెట్ట ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదు కావటంతో చెరువులు కుంటల్లో ఆశించిన మేరకు నీరు రాక పోవటం, ప్రధాన ప్రాజెక్టుల్లో కూడా ఖరీఫ్‌ పంటకు సరిపడే నీరు లేక పోవటంతో వివిధ జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాల వారీగా వర్షపాతం వివరాలను, పంట నష్టాన్ని సకాలంలో అంచనా కరువు మండలాలను ప్రకటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయక పోవటంతో కేంద్రం నుంచి కూడా ఎటువంటి సాయం కోరలేక పోతున్నది. వివిధ జిల్లాల నుంచి అధికారులు పంపే నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి ప్రత్యామ్నాయ పంటల పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. గత మూడేండ్లుగా జిల్లా కలెక్టర్లు నివేదికలు పంపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవటం లేదు. 14 వ ఆర్థిక సంఘం అన్ని రాష్ట్రాలతో కలిపి ఇచ్చే కరువు నిధులతో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సరిపెట్టుకుంటున్నది. ఈ నిధుల్లో 10 శాతం నిధులను కలిపి ఖర్చు పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కూడా విడుదల చేయటం లేదని అధికారులే అంటున్నారు. ప్రతి సంవత్సరం ఖరీఫ్‌ పంటల కాలం ముగిసిన తర్వాత మండలం ఒక యూనిట్‌గా కరువు పరిస్థితులను అంచనా వేయాల్సి ఉంటుంది. పంట నష్టం వివరాలను సేకరించిన తర్వాత ఈ నివేదికను సెప్టెంబర్‌లో గా కేంద్రానికి పంపితే కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపుతుంది. అయితే గత మూడేండ్లుగా ఇటువంటి ప్రక్రియ జరవగక పోవటం విశేషం. రాష్ట్రంలోని పూర్వపు మహబూబ్‌నగర్‌, వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, నల్లగొండ జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదయిన ప్రాంతంలో ప్రతి యేటా కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ప్రాంతాల్లో పంట నష్టంతో పాటూ పశువుల దాణా కొరత, తాగు నీటి కొరత భూగర్భ జలాలు తగ్గిపోవటం సర్వ సాధారణంగా జరుగుతున్నది. కేంద్రం నుంచి కరువు నిధులు రాక పోవటంతో ప్రత్యామ్నాయ పంటల పథకం అమలు చేయటం లేదు. ఇన్‌పుట్‌ సబ్సీడీ, ఉచిత విత్తనాల సరఫరా, పశువుల దాణా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, తాగునీటి రవాణా వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదు. ప్రతి సంవత్సరం సగటున 200 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని, పంటల నష్టం జరుగుతున్నదని గణాంకాలు చెప్తున్నాయి. పంట నష్టం రూ. 2,000 నుంచి 3,000 కోట్లు వరకూ ఉంటున్నదని అధికారిక లెక్కల ద్వారా స్పష్టమవుతున్నది. రైతు సంఘాల అంచనాల ప్రకారం ఈ నష్టం ఇంకా ఎక్కువే ఉంటున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించలేదు. 18 జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వమే చెప్తున్నది. ఈ జిల్లాల్లో భూగర్భ జలాలు కూడా గత సంవత్సరం కన్నా 3 మీటర్ల వరకూ లోతుకు పోయాయి. చెరువుల్లో నీరు కూడా తగ్గిపోయింది. ప్రధాన ప్రాజెక్టులైన ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్‌, జూరాల, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల కింద ఖరీఫ్‌లో సాగునీరందక పంటలు ఎండిపోయాయి. ఖరీఫ్‌ సీజన్‌ తర్వాతే కరువు మండలాలను గుర్తించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ గుర్తించలేదు. కరువు మండలాలను ప్రకటిస్తే కేంద్రం ఇచ్చే కరువు నిధులతో పాటూ ఉపాధి హామీ పథకం ద్వారా కూడా అధికంగా నిధులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేజార్చుకున్నది.

No comments:

Post a Comment