Breaking News

22/02/2019

ముంగిట్లోకి భూసార పరీక్షా కేంద్రాలు

వరంగల్, ఫిబ్రవరి 22, (way2newstv.in)
రైతన్నల ముంగిట్లోకే ఇక భూసార పరీక్ష కేంద్రాలు రానున్నాయి. దీంతో మట్టి పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లే ఇబ్బందులు వారికి తప్పనున్నాయి. అయితే ఇంతకాలం వరకు పరీక్షలపై ఆసక్తి చూపని వారు కూడా తమ మండలంలోనే మట్టి నాణ్యతను తెలుసుకునే అవకాశం ఉండడంతో ముందుకొస్తున్నారు. కాగా, జిల్లాకు ప్రభుత్వం పది పరిశోధన పరికరాలను మంజూరు చేసింది. ఈ మేరకు భూసార పరీక్షల నిర్వహణపై ఏఈఓలకు శిక్షణ కూడా పూర్తయింది.సహజంగా చాలా మంది రైతులు తమతోటి వారు ఎలా సాగు పనులు చేస్తే అలాగే ముందుకు సాగుతుంటారు. గత ఏడాది ఏ పం టకు ఎక్కువ ధర పలికిందో చూసుకుని అదే పంటను మరుసటి సారి వేయాలని నిర్ణయించుకుంటారు. తాము పంటలు పండించే నేల స్వభావం ఎలాంటిదో తెలియకున్నా.. ఫర్టిలైజర్‌ వ్యాపారులు ఇచ్చిన విత్తనాలు, పురుగు మందులు వినియోగించడం పరిపాటిగా వస్తోంది. 


 ముంగిట్లోకి భూసార పరీక్షా కేంద్రాలు


దీంతో నేలకు కావాల్సిన సారం అందకపోగా.. అవసరం లేని ఎరువులు, పురుగు మందుల వాడకంతో వట్టిపోతున్నాయి. ఫలితంగా వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టినా ఆశించిన దిగుబడి రావడం లేదు. ఈ నేపథ్యంలో మట్టిలోని సాంద్రత దెబ్బ తినకుండా  కాపాడేందుకు ప్రభుత్వం భూసార పరీక్షలు చేయించుకోవాలని రైతులకు కొన్నేళ్లుగా అవగాహన కల్పిస్తోంది. అయితే ఇప్పటివరకు భూసార పరీక్ష కేంద్రాలు జిల్లాలోనే ఉండడంతో రైతులు వాటిపై పెద్దగా ఆసక్తి చూపిం చడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం కేంద్రాలను అందరికీ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాకు తాజాగా 10 భూసార పరీక్షల పరికరాలను మంజూరు చేసింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో సుమారు 1.96 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరంతా ఏటా 6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పం టలను సాగుచేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల కొత్తగా 38 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ)లను జిల్లాకు కేటాయించగా.. ఇటీవల వారు విధుల్లో చేరారు. ఇందులో భాగంగా వారు భూసార పరీక్షలు ఏ విధంగా చేయాలి, వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకునేలా అధికారులు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో పదిహేను మండలాలు ఉండగా.. పది భూసార పరీక్షల పరికరాలు రావడం, ఏఈఓలు విధుల్లో చేరడంతో దాదాపు జిల్లా రైతులందరి భూముల భూసార పరీక్షలు నిర్వహించేందుకు వీలు ఏర్పడింది. ఇదే జరిగితే భూసార పరీక్షల నివేదిక ఆధారంగా ఏఈఓలు ఇచ్చే సూచనలతో రైతులు తగిన మోతాదులో మందులు వాడుతూ అధిక దిగుబడిలు సాధించి సాగులో విజయం సాధిస్తారు.

No comments:

Post a Comment