Breaking News

22/02/2019

యాప్ తో కామన్ అప్లికేషన్

మెదక్, ఫిబ్రవరి 22, (way2newstv.in)
మాతాశిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా మహిళా, శిశు సంక్షేమశాఖ (ఐసీడీఎస్‌) ప్రత్యేకంగా కామన్‌ అప్లికేషన్‌ సిస్టం (సీఏఎస్‌)ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ ద్వారా లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.పంపిణీ చేసిన స్మార్ట్‌ ఫోన్లను సొంతంగా  వినియోగించకుండా ప్రత్యేక యాప్‌ ద్వారా ట్రాక్‌ చేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.  వీరికి స్మార్ట్‌ఫోన్‌తో పాటు పవర్‌ బ్యాంక్, ప్రతిపాదించిన నెట్‌వర్క్‌ సిమ్‌కార్డుతో పాటు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించనున్నారు. సంబంధిత బిల్లులను ప్రభుత్వమే చెల్లించనుంది. అయితే ఇప్పటి వరకు రికార్డులు రాయడంలోనే అంగన్‌వాడీ టీచర్లు పూర్తిస్థాయిలో నిమగ్నం కావడంతో పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంగన్‌వాడీ కార్యకర్తలకు పని భారంతో పాటు రికార్డుల నిర్వహణ తప్పనుంది.ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు రిజిస్టర్‌లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలను నమోదు చేస్తున్నారు. 


యాప్ తో కామన్ అప్లికేషన్

ఇందుకుగాను మొత్తం 14 రకాల రికార్డులు రాయాల్సి ఉంది. దీంతో వారికి పని భారంతో పాటు రిజిస్టర్ల మోత  ఉంటుంది.ప్రస్తుతం ప్రభుత్వం స్మార్ట్‌ ఫోన్లు అందించనుండటంతో ఇకపై వారికి ఈ బాధలు తప్పనున్నాయి. దీంతో పాటు గర్భిణులకు సంబంధించిన ఇమ్యూనైజేషన్, ప్రసవం తేదీలను మూడు రోజుల ముందుగానే సంక్షిప్త సమాచారం ద్వారా తెలియడంతో వారు గర్భిణులను సరైన సమయంలో ఆసుపత్రులకు పంపించే అవకాశం ఉంటుంది.  స్మార్ట్‌ఫోన్లు అందించిన సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లకు నాలుగు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి విడతలో కుటుంబ నిర్వహణ అనే అంశంపై శిక్షణ ఉంటుంది.ఇందులో ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలను స్మార్ట్‌ఫోన్‌లో ఎలా అనుసంధానం చేయడం తదితర వివరాలను నమోదు చేయడం జరుగుతుంది. రెండోవిడతలో గృహ సందర్శన అనే అంశంపై శిక్షణ నిర్వహిస్తారు. మూడో విడతలో భాగంగా ఆహార పదార్థాలకు సంబంధించి శిక్షణనిస్తారు. చివరగా  నాలుగో విడతలో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణ అంశంపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలన్ని అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లకు స్మార్ట్‌ఫోన్లు అందించిన అనంతరం నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు.అలాగే గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లు, పాలు, భోజనం వంటి పౌష్టికాహారం అందించడంలో సైతం కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. అయితే ఇవి సక్రమంగా అందుతున్నాయా ? లేదా ? సరుకులు అందుబాటులో ఉన్నాయా ? లేదా ? అనే వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చడం ద్వారా ఉన్నతాధికారులకు క్షణాల్లో తెలుసుకునే వీలుంది. అయితే కొందరు అంగన్‌వాడీ టీచర్లు ఈ విషయమై తమకు పని భారం పెరిగే అవకాశం ఉంటుందన్నారు. స్మార్ట్‌ఫోన్లలో పొందుపర్చిన వివరాలు ఒక్కోసారి డిలీట్‌ అయ్యే పరిస్థితులు ఉంటాయని... దీంతో తాము రిజిష్టర్లలో కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు. 

No comments:

Post a Comment