Breaking News

01/02/2019

కాకినాడ లో కాక రేపుతున్న సీట్

కాకినాడ, ఫిబ్రవరి 1, (way2newstv.in)
ఎన్నికలకు ఇంకా రెండే నెలల సమయం ఉంది. ప్రధానపార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ అభ్యర్ధి పై దృష్టి సారించలేదు. అభ్యర్థి ఎవరైనా…ఏ పార్టీ అయినా..ఇక్కడ అన్ని పార్టీల నుంచి కాపు సామాజిక వర్గం వారే బరిలోకి దిగుతారన్నది మాత్రం సుస్పష్టం. అదే కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం. కాకినాడ పార్లమెంటునియోజకవర్గంలో ఇప్పటి వరకూ ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలు వర్క్ అవుట్ చేయడం లేదు. చివరినిమిషంలో కాకినాడ ఎంపీ అభ్యర్థులు అన్ని పార్టీల్లోనూ ఖారారయ్యే అవకాశాలున్నాయి.పార్లమెంటు పరిధిలో కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, తుని, పత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తోట నరసింహం గెలుపొందారు. ఆయన ప్రస్తుతం టీడీపీ లోక్ సభాపక్షనేతగా వ్యవహరిస్తున్నారు. కానీ తోట నరసింహం ఈసారి పోటీ చేయడానికి సుముఖత చూపడం లేదు. ఆరోగ్య సమస్యలతో పాటు ఆయన అసెంబ్లీకి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. తన ఆలోచనను అధిష్టానం ముందు కూడా ఉంచారు. 


కాకినాడ లో కాక రేపుతున్న సీట్

దీంతో టీడీపీ ఇక్కడ కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిందే.గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ ను బరిలోకి దించాలని తొలుత టీడీపీ భావించింది. ఆయన వరుసగా రెండుసార్లు ఒకసారి ప్రజారాజ్యం, మరోసారి వైసీపీతరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే చలమలశెట్టి సునీల్ జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతుంది. జనసేనలో చేరినా సునీల్ కాకినాడ ఎంపీ స్థానానికి పోటీ చేయాల్సిందే. సునీల్ ఏ పార్టీలో చేరినా వరుసగా మూడుసార్లు వేర్వేరు పార్టీల్లో పోటీ చేసిన పేరు ఆయనకు దక్కుతుంది. చలమలశెట్టి సునీల్ టీడీపీ ఆఫర్ కు ఓకే చెబుతారా? లేక జనసేనలో చేరతారా? అన్నది తేలాల్సి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిందే. పార్టీలో ఉండి కూడా చలమలశెట్టిసునీల్ యాక్టివ్ గా లేకపోవడం, ఆయన ఇతర పార్టీలకు వెళతారన్న ప్రచారంతో అభ్యర్థుల అన్వేషణలో వైసీపీ ఉంది. ఇప్పటి వరకూ వైసీపీలో అభ్యర్థి ఎవరనే చర్చ కూడా రాలేదు. ఎన్నికలకు ముందు డిసైడ్ చేస్తామంటుంది ఆ పార్టీ అధిష్టానం. ఇక కాంగ్రెస్ పార్టీ తరుపున ఈ స్థానం నుంచి మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు పోటీ చేసే అవకాశముంది. పల్లంరాజుకు ఈ సెగ్మెంట్ లో పట్టు ఉండటంతో ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొనే అవకాశముంది.

No comments:

Post a Comment