Breaking News

05/02/2019

టీటీసీ కాలేజీల్లో అక్రమాలకు నెలవు

కర్నూలు, ఫిబ్రవరి 5, (way2newstv.in)
‘బోధనా’ విలువలు నేర్పించే కళాశాలలే దారి తప్పాయి. ప్రభుత్వ శాఖలను బురిడీ కొట్టించాయి. అనుమతుల కోసం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించాయి. అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన భద్రతా చర్యలు లేకుండానే అడ్డదారుల్లో అనుమతులు పొందాయి. నకిలీ ఎన్‌ఓసీలతో ఏకంగా రాయలసీమ యూనివర్సిటీనే బురిడీ కొట్టించాయి. మామూళ్ల మత్తులో జోగిన వర్సిటీ అధికారులు వాటిని పరిశీలించకుండానే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. జిల్లా వ్యాప్తంగా 96 బీఈడీ, డీఈడీ బోధనా కళాశాలలు ఉండగా.. వాటిలో 11 మాత్రమే అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) పొంది ఉన్నాయి. మిగిలిన 85 కాలేజీలకు ఎన్‌ఓసీలు లేవు. కళాశాలల్లో చదివే విద్యార్థులు, అధ్యాపకుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు ఆర్పడానికి తప్పనిసరిగా ఫైర్‌ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం అగ్ని మాపక శాఖ అధికారుల తనిఖీ అనంతరం పొందే నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ను వర్సిటీకి సమర్పించాల్సి ఉంటుంది.


 
టీటీసీ కాలేజీల్లో అక్రమాలకు నెలవు

 500 చదరపు మీటర్ల విస్తీర్ణం లేదా ఆరు మీటర్ల ఎత్తయిన కళాశాల భవనం ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అగ్ని మాపక శాఖ సూచించిన మేర భద్రతా చర్యలు చేపట్టాలి. ఫైర్‌ ఎస్టింగర్లతో పాటు హోజ్‌రీల్‌ పైపు, ఫైర్‌ పంప్, భవనం పైన వాటర్‌ ట్యాంకు ఏర్పాటు చేయాలి. 2007 సంవత్సరానికి ముందునిర్మించిన భవనమైతే ఆఫ్‌లైన్‌లో, ఆ తరువాత నిర్మించి ఉంటే ఆన్‌లైన్‌లో ఎన్‌ఓసీ కోసం  అగ్నిమాపక శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత సంబంధిత స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే ఎన్‌ఓసీ జారీ చేస్తారు.జిల్లాలో 96 బీఈడీ, డీఈడీ కళాశాలలు ఉండగా.. అందులో 11 మాత్రమే అసలు సర్టిఫికెట్లు పొంది ఉన్నాయి. మిగిలిన వాటికి ఎన్‌ఓసీలు లేవు. ఇందులో కొన్ని కళాశాలలు చలానా చెల్లించిన రసీదుతో అనుమతులు పొందగా.. మరికొన్ని నకిలీ ఎన్‌ఓసీలను జత చేసి అనుమతి సంపాదించాయి. వాస్తవానికి బోధనా కళాశాలల్లో రకరకాల చార్జీలు,  ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ నిబంధనల మేరకు భద్రతా చర్యలు చేపట్టడం లేదు. కళాశాలలకు అనుమతులిచ్చే వర్సిటీ అధికారులు కూడా వచ్చిన ధ్రువపత్రాలు అసలువా.. నకిలీవా? అని చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.ఇటీవలే కొన్ని కళాశాలల ఎన్‌ఓసీలపై అనుమానం వచ్చిన అగ్నిమాపక శాఖ డీజీ.. ఆ సర్టిఫికెట్ల నిర్ధారణకు జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ను ఆదేశించారు. అవి నకిలీవని తేలడంతో జిల్లాలోని అన్ని కళాశాలల సర్టిఫికెట్లు పరిశీలించి వాస్తవికతతో కూడిన నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో 96 కళాశాలలల్లో కేవలం 11 ఎన్‌ఓసీలు మాత్రమే అసలువని తేలింది.

No comments:

Post a Comment