Breaking News

21/02/2019

బీజేపీలో పోటీకి అభ్యర్ధులు కావలెను

విజయవాడ, ఫిబ్రవరి 21, (way2newstv.in)
ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ముందుకు రావడమే కష్టంగా మారింది. అంతెందుకు ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలే ఇందుకు సుముఖంగా లేరు. ప్రత్యేక హోదాప్యాకేజీ ఇవ్వకపోవడం, విభజన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొనడమే దీనికి కారణం. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో 13 అసెంబ్లీ స్థానాల్లో, నాలుగు లోక్‌సభ సీట్లలో బీజేపీ పోటీచేసింది. కానీ నాలుగు అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. పదేళ్లు కాంగ్రెస్‌ ఎంపీగా ఉండి.. ఎనిమిదేళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి సైతం రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు. నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు, విశాఖ నుంచి కంభంపాటి హరిబాబు ఎంపీలుగా విజయం సాధించారు.బీజేపీపై జనాగ్రహంతో పాటు రాష్ట్ర నాయకత్వం శ్రీకాకుళం జిల్లా నుంచి బస్సుయాత్ర చేపట్టి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను ఆహ్వానిస్తే కనీసం వంద మంది కూడా రాని దుస్థితి. 


బీజేపీలో పోటీకి అభ్యర్ధులు కావలెను

ఈ పరిస్థితుల్ని అంచనా వేసిన ఎంపీలు హరిబాబు, గంగరాజు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేరని పార్టీలో ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తల్లి వైఎస్‌ విజయలక్ష్మిపై విశాఖపట్నంలో లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన హరిబాబు ఆ సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ రైల్వే జోన్‌. కేంద్రం ఆ ఊసే ఎత్తడంలేదు. దీనిపై సానుకూల స్పందన కూడా లేకపోవడంతో గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంలేదు. తప్పక పాల్గొన్నా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గంగరాజుకు నేరుగా అమిత్‌ షాతోనే సత్సంబంధాలున్నాయి. కానీ రాష్ట్ర నాయకత్వంతో సఖ్యత లేని కారణంగా.. ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.తన కుమారుడిని వైసీపీలోకి పంపి.. నరసాపురం లోక్‌సభ టికెట్‌ ఖరారుచేయించుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పురందేశ్వరి ఈ సారి బీజేపీ తరపున ఎక్కడ పోటీ చేస్తారన్నది తెలియరాలేదు. కానీ ఆమె కుమారుడు హితేశ్‌, భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవలే వైసీపీలోకి వెళ్లారు. హితేశ్‌కు ప్రకాశం జిల్లా పరుచూరు అసెంబ్లీ సీటు ఖరారైందని కూడా తెలిసింది. దీనిపై పార్టీలోని ఒక వర్గం అభ్యంతరం చెబుతోంది. కుటుంబ సభ్యులతో కూడా ఓట్లు వేయించుకోలేని వ్యక్తి పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చని పార్టీలోకి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో రాజమహేంద్రవరం అర్బన్‌ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరిపోయారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌..ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోనని సభాముఖంగానే ప్రకటించారు. బీజేఎల్పీ నేతగా ఉన్న విష్ణుకుమార్‌రాజు.. వేరే పార్టీలో చేరి పోటీచేయనున్నట్లు గట్టి ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలింది తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావు మాత్రమే. పార్టీ ఆదేశిస్తే పోటీకి ఆయన సంసిద్ధంగానే ఉన్నారు.

No comments:

Post a Comment