రాబోయే రోజుల్లో గిరిజనులకు 10శాతం విద్య, ఉద్యోగాలు కల్పిస్తాం
- త్వరలోనే రైతుబంధు పథకం రూ.16వేలు పంటలకు సాయం
నంగునూరు, ఫిబ్రవరి 15:(way2newstv.in)
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తండాలకు, గిరిజనులకు గుర్తింపు వచ్చిందని, రాబోయే రోజులలో గిరిజనులకు 10శాతం విద్య, ఉద్యోగాలను కల్పిస్తామని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని జెర్రిపోతుల తండా గ్రామంలో శుక్రవారం శ్రీ సత్ సేవాలాల్ మహరాజ్ 280వ జయంతి ఉత్సవానికి హాజరై సేవాలాల్ కు నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. సేవాలాల్ ఉత్సవాన్ని పురస్కరించుకుని తండా వాసులు డప్పు చప్పుళ్లతో లంబాడీ మహిళలు నృత్యాలు చేస్తూ కుంకుమ తిలకం దిద్ది, మంగళహారతులతో హరీశ్ రావును ఘనంగా స్వాగతించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలకు, గిరిజనులకు గుర్తింపు
జేపీ తండా గ్రామ సర్పంచ్ బుక్య భిక్షపతి నాయక్ ఆధ్వర్యంలో మహా భోగ్ భండారో సందర్భంగా సేవా లాల్ మహరాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభ సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ శ్రీ సేవాలాల్ జయంతిని తెలంగాణ ప్రభుత్వమే అధికారిక జరుపుతున్నదని, ఉమ్మడి రాష్ట్రంలో మీరంతా చందాలు వేసుకుని జయంతి ఉత్సవాలు జరుపుకునే వారని గుర్తు చేశారు. అన్ని కులాలు, మతాలను గౌరవించాలనే సంప్రదాయం కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్వర్తిస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని., రాష్ట్రంలోని 3200 తండాలలో లంబాడీలే సర్పంచ్ లయ్యారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆడపిల్లలను అమ్ముకునే పరిస్థితి ఉండేదని., కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పేదింటి ఆడపిల్లల పెళ్లికి కల్యాణ లక్ష్మితో లక్షా 116 రూపాయలు ఇచ్చి పేద కుటుంబాలలో వెలుగులు నింపుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఎస్సీ, ఎస్టీల కోసం విద్యకు పెద్దపీట వేసి, విద్యాలయాలు తెచ్చిందని, పేద విద్యార్థులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి విదేశ విద్యలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు. వారం రోజుల పాటు అందరూ సమిష్టిగా కలిసి జేపీ తండాను స్వచ్ఛ తండా చేశారని, ఇప్పుడు జేపీ తండా పరిశుభ్రంగా ఉన్నదని., ఎప్పుడూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. జెర్రిపోతుల తండా గ్రామాభివృద్ధికి దశల వారీగా సహకరిస్తానని, మీ ఇళ్లు బాగుండాలి. గల్లీ బాగుండాలి మీ తండా బాగుండాలని.. ఊరు పరిశుభ్రంగా ఉంటే రోగాలు రావని ఇందులో గ్రామస్తుల భాగస్వామ్యం కావాలని అన్నరు. మీ తండా గ్రామం శుభ్రంగా ఉండేలా ప్రతి వారం వారం కలిసి కట్టుగా గ్రామ పరిశుభ్రతకు పాటు పడాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలకు గుర్తింపు వచ్చిందని, త్వరలోనే గిరిజనులకు 10శాతం విద్య, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతులకు మేలు చేకూరేలా రైతుబంధు పథకం కింద రూపాయలు 16వేలు ఇవ్వనున్నట్లు., రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10వేలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.6వేలు మొత్తం రైతుబంధు పథకం కింద ప్రతి రైతుకు పంట సాయం చేసేందుకు రూ.16వేలు అందనున్నట్లు వెల్లడించారు. ఇక రానున్న రోజులలో గోదావరి జలాలు తేవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డి, మండల అధికారిక యంత్రాంగం, సిద్ధిపేట మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, నంగునూరు మండల ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, సిద్ధిపేట మాజీ ఏఎంసీ ఛైర్మన్ వేముల వెంకట్ రెడ్డి, జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యులు దువ్వల మల్లయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ కోల రమేశ్ గౌడ్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు వేముల కొండల్ రెడ్డి, తెరాస సీనియర్ నాయకులు కూతురు రాజిరెడ్డి, జేపీ తండా పెద్దలు లక్ష్మణ్ నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment