Breaking News

28/02/2019

కడపలో తెలుగు తమ్ముళ్ల పోరాటం

కడప, ఫిబ్రవరి 28, (way2newstv.in)
ఏప్రిల్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్లను తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం రమేష్‌కుమార్‌రెడ్డికి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం శ్రీకాంత్‌రెడ్డికి ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు మాజీ జడ్పీ ఛైర్మన్ బాలసుబ్రమణ్యం స్వతంత్రఅభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించడంతో ఇరు పార్టీల నాయకుల్లో టెన్షన్ మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పాలకొండ్రాయుడు చిన్న కుమారుడు ప్రసాద్‌బాబును పిలిపించి రమేష్‌కుమార్‌రెడ్డికి వచ్చే ఎన్నికలలో మద్దతు ఇచ్చి గెలిపించాలని మంత్రుల సమక్షంలో ఒప్పంద తీర్మానం చేశారు. ఈ తీర్మానం మేరకు ప్రసాద్‌బాబు టీటీడీ మెంబర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించారు. దీంతో కార్యకర్తలు ప్రసాద్‌బాబుపై అసహనం వ్యక్తం చేశారు. చివరకు ప్రసాద్‌బాబు నాయకులు, కార్యకర్తలను బుజ్జగించి రమేష్‌రెడ్డిని గెలిపించాలని చెప్పారు. ఇది జరిగిన తరువాత అదే కుటుంబానికి చెందిన మాజీ జడ్పీ ఛైర్మన్ బాలసుబ్రమణ్యం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో రమేష్‌రెడ్డి వర్గీయుల్లో టెన్షన్ మొదలైంది. ప్రసాద్‌బాబు అన్న అయిన సుబ్రమణ్యంకు అంతర్గతంగా మద్దతు ఇస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 



 కడపలో తెలుగు తమ్ముళ్ల పోరాటం

ఈ క్రమంలో జిల్లా మంత్రులు రాయచోటికి వచ్చి ప్రసాద్‌బాబుతో చర్చించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారని తెలిసింది. గత రెండు రోజుల కిందట జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, రమేష్‌రెడ్డిలు మాజీ ఎమ్మెల్యే ద్వారకనాధరెడ్డిని కలిశారు. సుమారు గంటపాటు చర్చలు జరిపారని తెలిసింది. వచ్చే ఎన్నికలలో తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.  ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే ద్వారకనాధరెడ్డి ఇంటికి వెళ్లి వైసీపీ వీడి టీడీపీలోకి వెళ్లవద్దని జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించి ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తామని తెలిపారు. అదే విధంగా మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి కూడా కలవనున్నట్లు తెలిపారు. అందుకు ద్వారకనాధరెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా స్వతంత్రరంగా పోటీ చేస్తానని బాలసుబ్రమణ్యం ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు సెగ్మెంట్‌లోని మండలాలకు చెందిన నాయకులు ఆయన్ను కలిసి మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా పట్టణంలోని ముస్లిం మైనార్టీ నాయకులు మాత్రం గత 30 సంవత్సరాల నుంచి రాయుడు వర్గాన్ని నమ్ముకుని వస్తున్నామని, ప్రస్తుతం ప్రసాద్‌బాబుకు టిక్కెట్ రాకపోవడంతో అదే కుటుంబానికి చెందిన పెద్ద కుమారుడు బాలసుబ్రమణ్యం పోటీ చేస్తుండటంతో ఆయనకు మద్దతు ఇచ్చేందుకు అంతర్గతంగా మంతనాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఈ దిశగా బాలసుబ్రమణ్యంను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనివ్వకుండా తెలుగుదేశం అధిష్టానం నుంచి ఇటు తండ్రి, తమ్ముడు ప్రసాద్‌బాబు నుంచి ఒత్తిడి తీసుకురానున్నట్లు రమేష్‌రెడ్డి వర్గీయులు మాత్రం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. బాలసుబ్రమణ్యం పోటీ చేస్తే తమకు ఎక్కడ అవాంతరాలు వస్తాయని ఏదో ఒక విధంగా పోటీ చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రాయచోటికి మంత్రులు కూడా రావడం అందుకోసమేనని పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా బాలసుబ్రమణ్యం పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని భావించక తప్పదు

No comments:

Post a Comment