Breaking News

28/02/2019

చంద్రబాబు టార్గెట్ రాయలసీమ

కర్నూలు, ఫిబ్రవరి 28, (way2newstv.in)
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతం నుంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష నేత జగన్ ఇలాకా కడప జిల్లాలో సమర్థులైన అభ్యర్థులను బరిలో నిలపటం ద్వారా టీడీపీ పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులోభాగంగా మూడురోజులుగా కడప, కర్నూలు జిల్లా పార్టీ నేతలతో సమీక్షలు జరుపుతున్నారు. అంతకుముందే కృష్ణా జిల్లాలోని రెండు పార్లమెంట్, శాసనసభ స్థానాలకు సంబంధించి సమీక్ష పూర్తయింది. కృష్ణా జిల్లాలో దాదాపు సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నారు. ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా పెద్దగా మార్పుచేర్పులు ఉండబోవని చెపుతున్నారు. కాగా కడప జిల్లాలో కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయావకాశాలు ఉన్న అభ్యర్థులనే బరిలో నిలపనున్నారు. కడప లోక్‌సభ స్థానానికి మంత్రి ఆదినారాయణరెడ్డి పేరు దాదాపు ఖరారయింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున అవినాష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీలో ఆధిపత్య పోరు సాగిస్తున్న మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదర్చటం ద్వారా జిల్లా పార్టీలో తలనొప్పులు లేకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు. 


చంద్రబాబు టార్గెట్ రాయలసీమ


కడప, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థుల ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు. పులివెందుల నుంచి జగన్‌కు దీటైన అభ్యర్థిని రంగంలోకి దించాలని కసరత్తు చేస్తున్నారు. అయితే స్థానికంగా ఆశావహుల నుంచి అసమ్మతి ఎదురుకాకుండా ఈసారి ఆచితూచి అడుగేయాలని నిర్ణయించారు. ఇక రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఈసారి చేజారినివ్వరాదని కడప జిల్లా పార్టీ నేతలను బాబు ఆదేశించారు. ఇక్కడి నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పీవీ మిథున్‌రెడ్డి గెలుపొందారు. ఈసారి ఈ నియోజకవర్గం నుంచి అంగ, అర్థబలాలు ఉన్న అభ్యర్థిని బరిలో నిలపనున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కడప జిల్లాలోని రాజంపేట, కోడూరు (ఎస్సీ), రాయచోటి, రైల్వేకోడూరు సెగ్మెంట్లు ఉండగా చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు సెగ్మెంట్లు వస్తాయి. చిత్తూరు జిల్లా సమీక్ష కూడా పూర్తయిన తరువాత రాజంపేట పార్లమెంట్ స్థానంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నట్లు పార్టీ నేతలు చెపుతున్నారు. ఇదిలావుండగా గురు, శుక్రవారాల్లో కర్నూలు జిల్లాలోని రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలపై ఎడతెగని సమీక్ష జరుగుతోంది. జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యవహరిస్తున్నారు.. కర్నూలు పార్లమెంట్ స్థానంతో పాటు ద్రోన్ లేదా ఆలూరు సెగ్మెంట్లను కోట్ల వర్గీయులు ఆశిస్తున్నారు. ఇదిలావుంటే కర్నూలు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బుట్టా రేణుక వైసీపీని వీడి టీడీపీలో చేరటంతో వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ భవితవ్యంపై మల్లగుల్లాలు పడుతున్నారు. రేణుకను ఈసారి ఎమ్మిగనూరు లేదా పాణ్యం శాసనసభ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో నంద్యాల, ఆళ్లగడ్డ శాసనసభ స్థానాల్లో పార్టీలో గ్రూపు విభేదాలు కొనసాగుతున్నాయి. దీనికితోడు నంద్యాల పార్లమెంట్ బరిలో నిలిచే విషయమై టీజీ వెంకటేష్ తనయుడు భరత్, ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. కర్నూలు జిల్లా పార్టీలో నెలకొన్న గ్రూపుల వైరాన్ని సమన్వయపరచటం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా తలనొప్పిగా మారిందని అంటున్నారు. కోట్ల చేరిక కోసం కేఈని ఇప్పటికే బుజ్జగిస్తున్నారు. పత్తికొండ నుంచి తిరిగి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు కోరుతున్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల సిటింగ్ ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డిని కొనసాగించే విషయంలో కూడా ముఖ్యమంత్రి సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ సోదరి మౌనికకు అవకాశం ఇవ్వాలనే యోచనతో ఉన్నట్లు తెలిసింది. కాగా ఆదోని, నంద్యాల, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లె అభ్యర్థుల ఎంపిక ఇంకా తేలలేదు. అయితే దీనిపై పార్టీ అధినేత ఓ నిర్ణయానికి వచ్చినా బాహాటంగా ఇప్పుడే ప్రకటించే అవకాశాలు లేవని పార్టీ శ్రేణుల సమాచారం. కాగా సమీక్షల సందర్భంగా కడపలోని రెండు పార్లమెంట్ స్థానాలు, 11 అసెంబ్లీ సెగ్మెంట్లు, కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంట్, 14 శాసనసభ నియోజకవర్గాల్లో విజయం సాధించాలని మాత్రం పార్టీ నేతలకు స్పష్టం చేశారు. కేఈ, కోట్ల వైరంపై పరోక్షంగా స్పందిస్తూ దశాబ్దాల కాలంగా రాజకీయ విభేదాలు విడనాడి కలసికట్టుగా పనిచేస్తే కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారుతుందని, అంతా ఏకతాటి పైకి వస్తే కార్యకర్తల్లో నూతనోత్తేజం వస్తుందని నచ్చచెప్పే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక అనంతపురం జిల్లాలో గ్రూపుల పోరును సమన్వయపరచటంతో పాటు సొంత జిల్లా చిత్తూరులో సమర్థులను రంగంలో దించితే సీమలో పట్టు సాధించవచ్చని భావిస్తున్నారు

No comments:

Post a Comment