Breaking News

12/02/2019

54 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిన ధాన్యం

నిజామాబాద్, ఫిబ్రవరి 11, (way2newstv.in)
తెలంగాణ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ కసరత్తు చేస్తున్నది. ఏటేటా ధాన్యం కొనుగోళ్లు పెరుగుతుండటంతో ఈ నిర్ణయానికి వచ్చింది. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్‌ వంటి పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం అధికమై ఏటేటా ధాన్యం దిగుబడి పెరుగుతున్నది.. పౌరసరఫరాల సంస్థ 2017-18 ఏడాదికిగాను ఖరీఫ్‌లో 18.27 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం, రబీలో 35.81 లక్షల మెట్రిక్‌ టన్నులు.. మొత్తంగా 54.08 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఒక్క ఖరీఫ్‌లోనే 3,297 కొనుగోలు కేంద్రాల ద్వారా 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వచ్చే రబీలో మరో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. 54 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిన ధాన్యం

రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరగటంతో దాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఆ శాఖ కసరత్తు చేస్తున్నది. ఆ విధంగా వచ్చిన ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేయడానికి చర్యలు తీసుకుంటున్నది. గతంలో మన రాష్ట్ర తమిళనాడుకు మూడు వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సరఫరా చేసిన విషయాన్ని అధికారులు గుర్తుచేస్తున్నారు. వచ్చే ఏడాది కాలంలో రానున్న రబీ, ఖరీఫ్‌ సీజన్‌లో పౌరసరఫరాల శాఖ రైతుల నుండి భారీగా ధాన్యం కొనుగోలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన చర్యలపై అధికారులు ఇప్పటి నుంచే దృష్టిసారించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్‌, రబీ రెండూ సీజన్‌లో కలిపి 54 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఒక ఖరీఫ్‌లోనే ఏకంగా 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ సంస్థ రికార్డు సృష్టించింది. రబీ సీజన్‌ ధాన్యం ఇంకా రావాల్సి ఉన్నది.దీంతో వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉన్నది. దీంతో ధాన్యం ఉత్పత్తులు ఇప్పుడున్న దానికంటే రెట్టింపు అవుతాయని సర్కారు అంచనా వేస్తున్నది. ధాన్యం దిగుబడులకు తగ్గట్టుగా ప్రభుత్వం మార్కెటింగ్‌ వ్యూహాలను కూడా సిద్ధం చేస్తున్నది. ఇప్పటివరకూ రాష్ట్రంలో ధాన్యాన్ని సేకరించటం, పీడీఎస్‌ ద్వారా రేషన్‌ దుకాణాలకు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు బియ్యం సరఫరా చేసేందుకు మాత్రమే పరిమితమైన పౌరసరఫరాల సంస్థ ఇప్పుడు మార్కెటింగ్‌పై దృష్టిసారించింది. మన సన్నబియ్యానికి దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్నది. దీంతో ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఇక్కడి బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా సంస్థలో ప్రత్యేక బిజినెస్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విభాగం ద్వారా రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. ఈ ధాన్యాన్ని రాష్ట్రంలోనే మిల్లింగ్‌ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయనున్నారు. బియ్యం మార్కెట్‌ను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఆయా రాష్ట్రాల, దేశాల అవసరాలకు తగ్గట్టుగా మన సన్న బియ్యాన్ని ఇక్కడి నుంచి నేరుగా ప్రపంచ మార్కెట్‌ కు ఎగుమతి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నది. పెరుగుతున్న ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోలు ప్రణాళికలను రూపొందించుకుని, రైతులకు కనీస మద్దతు ధర అందించడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించే పనిలో ఆ శాఖ నిమగమైంది. ఇందులో భాగంగా బిజినెస్‌ విభాగాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నది. అలాగే ప్రజాపంపిణీలో అక్రమాలను నిరోధించి, అర్హులకే నిత్యావసర సరుకులు అందేలా ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానంతో అనేక చర్యలు చేపట్టింది. వీటిని మరింత పటిష్ట, విస్తృతపరిచ దిశంగా ముందుకు సాగుతున్నది. ధాన్యం సేకరణ, కస్టం మిల్లింగ్‌ రైస్‌, గోదాముల్లో బియ్యం నాణ్యత, ధాన్య సేకరణలో గన్నీ సంచుల వినియోగం, ఆర్థికంగా రాష్ట్రంపై భారం పడకుండా నిర్దేశిత సమయంలో రేషన్‌ బియ్యం రవాణా, పంపిణీపై, ఇతర ఆర్థికపరమైన అంశాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ విభాగం నిఘాపై, సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా ప్రవేశపెట్టిన విధానాలు, ధాన్యం చెల్లింపులకు సంబంధించి ఓపీఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ వంటి అంశాలపై అధికారులకు శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు. 

No comments:

Post a comment