Breaking News

08/08/2018

కాంగ్రెస్ వైపు కమల్.... రజనీకి బీజేపీ గాలం

చెన్నై, ఆగస్టు 8, (way2newstv.in) 
తమిళనాడులో ఇద్దరు స్టార్ హీరోలు రాజకీయంగా కలిసే అవకాశాలు కన్పించడం లేదు. సినిమాల్లో కలసి నటించినా…. పాలిటిక్స్ లో మాత్రం వేర్వేరుగా పోటీ పడతారన్న టాక్ బలంగా విన్పిస్తోంది. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను గుర్తించిన స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ లు రాజకీయాల్లోకి వచ్చేశారు. కమల్ హాసన్ ఇప్పటికే మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టగా, రజనీకాంత్ మాత్రం రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు. పార్టీని త్వరలోనే ప్రకటించనున్నారు. రాజకీయంగా వీరిద్దరి అభిప్రాయాలు కుదరవు. ఇద్దరివీ రాజకీయంగా వేర్వేరు దారులు. అందుకోసమే ఇద్దరూ రెండు ప్రధాన పార్టీలతో జత కట్టే అవకాశాలున్నాయన్నది అంచనా.కమల్ హాసన్ తొలి నుంచి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమే. ఆయన ఎన్నోమార్లు ట్విట్టర్లోనూ, అనేక వేదికల మీద బీజేపీ మీద నిప్పులు చెరిగారు. ముఖ్యంగా హిందుత్వపై కమల్ చేసిన వ్యాఖ్యలు గతంలో దుమారం రేపాయి. 



కాంగ్రెస్ వైపు కమల్....
రజనీకి బీజేపీ గాలం

ఇలా బీజేపీకి తొలి నుంచి వ్యతిరేకంగానే పవన్ పావులు కదుపుతున్నారు. మక్కల నీది మయ్యమ్ పార్టీ ఆవిర్భావ సభకు కూడా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఆహ్వానించారు. తర్వాత టెన్ జన్ పథ్ కు వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిసి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో కాంగ్రెస్ కూటమిలో కమల్ చేరతారన్న వార్తలు వస్తున్నాయి.వచ్చే లోక్ సభ ఎన్నికలకు తమిళనాడులో బలమైన కూటమిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మిత్రపక్షంగా ఉన్న డీఎంకేతో పాటు, టీటీవీ దినకరన్ కొత్త పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, పీఎంకే వంటి పార్టీలతో పాటు కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ ను కూడా కలుపుకుని వెళ్లాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఈ ఆలోచనకు కమల్ హాసన్ సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. మక్కల్ నీది మయ్యమ్ ఇంకా క్షేత్రస్థాయిలో బలోపేతం కాకపోవడంతో లోక్ సభ ఎన్నికల వరకూ కాంగ్రెస్ కూటమితో కలసి వెళ్లాలన్నది కమల్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.ఇక మరో జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా తమిళనాట కొత్త పొత్తులకు సిద్ధమవుతోంది. రజనీకాంత్ సహకారం తీసుకోవాలని భావిస్తుంది.ఇటు అన్నాడీఎంకే ఎటూ ఉండనే ఉంది. అన్నాడీఎంకే, బీజేపీ రజనీ మద్దతుతో లోక్ సభ ఎన్నికలను గట్టెక్కాలని భావిస్తున్నాయి. రజనీకాంత్ తొలి నుంచి కొంత బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక అన్నాడీఎంకేకు కూడా నాయకత్వ సమస్యతో అల్లాడిపోతుండటంతో రజనీ సహకారం కావాలని గట్టిగా కోరుకుంటుంది. అందుకేనేమో తమిళ భాషాభివృద్ధి శాఖా మంత్రి మాఫోయ్ పాండియ రాజన్ రజనీని అన్నాడీఎంకే చేరాలని పిలుపునిచ్చారు. అన్నాడీఎంకే సిద్ధాంతాలకు రజనీ అనుకూలంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు తమిళనాట సంచలనం కల్గిస్తోంది. మొత్తం మీద ఇద్దరు హీరోలు కొత్త పార్టీ పెట్టి మరీ చెరో కూటమిలో చేరిపోతారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

No comments:

Post a Comment