Breaking News

08/08/2018

పవన్ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది...

హైద్రాబాద్, ఆగస్టు 8, (way2newstv.in) 
పవన్ ఎవరికి ఉపయోగపడతారు? పవన్ ఎవరి ఓట్లు చీల్చేస్తారు? దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇదే ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రధాన చర్చ. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంత దూకుడుగానే వెళుతున్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే అక్కడకు వెళ్లి ప్రభుత్వ పనితీరును ఎండగడుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకున్నారు. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కామ్రేడ్లతో కలసి వెళ్లేందుకే పవన్ నిర్ణయించుకున్నారు. 



పవన్ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది...

దాని వల్ల బూత్ లెవల్లో క్యాడర్ అందుబాటులో ఉంటుందని ఆయన విశ్వసిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఏపీలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. జనసేన పోటీ చేస్తే ఎంతో కొంత ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే పవన్ కు బలమైన సామాజిక వర్గంతో పాటు యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. యంగ్ జనరేషస్ కు అనుగుణంగానే పవన్ ప్రసంగాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంపైనా, ప్రతిపక్షంపైనా పవన్ చేసే విమర్శలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మేధావి వర్గం కూడా పవన్ ఆలోచనలు, ఆశయాలు సక్రమంగానే ఉన్నాయన్న కితాబునిస్తోంది. పవన్ ఎవరి ఓట్లకు గండికొడతారన్న చర్చ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ పార్టీకి రెండు వర్గాల ఓట్లు పడతాయన్నది అంచనా. ఒకటి కాపు సామాజిక వర్గం ఓట్లు కాగా, రెండోది యువ ఓటర్లు. అయితే గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఓటర్లు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. యువత జగన్ వైపు నిలిచింది. కానీ ఈసారి రెండు వర్గాల ఓట్లను పవన్ ఒంటరిగా పోటీ చేసి చీల్చే అవకాశాలు ఉండటంతో ఇటు అధికార తెలుగుదేశం పార్టీకి, అటు వైసీపీకి నష్టమేనంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలను పవన్ దెబ్బకొట్టే అవకాశముందంటున్నారు. దీంతో ఆ యా సామాజికవర్గంతో పాటు యువ ఓటర్లను కూడా తెలుగుదేశం, వైసీపీ ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.ఇక తెలంగాణ విషయానికొస్తే పవన్ పెద్దగా ఇక్కడ ఫోకస్ పెట్టకపోయినా పోటీకి దిగడం ఖాయమనే చెబుతున్నారు. ఇది కేసీఆర్ కు లాభం చేకూరుస్తుందన్న అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పవన్ అనేక సార్లు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రశంసించిన సందర్భాలున్నాయి. అందుకోసం కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లోనూ, ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లో పవన్ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణలో కాపు సామాజిక వర్గంతో పాటు సెటిలర్లు, యువత ఓట్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చగలిగితే అది తనకు లాభమని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు పీకే సహకారం తీసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పవన్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా మారింది.

No comments:

Post a Comment