Breaking News

27/08/2018

నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియంను మార్చొద్దు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మన్మోహన్‌ సింగ్‌ లేఖ

న్యూఢిల్లీ ఆగష్టు 27 (way2newstv.in)
దేశ రాజధానిలో నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీని మాజీ ప్రధానుల మ్యూజియంగా మార్చాలని కేంద్రం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మేరకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. నెహ్రూ ప్రతిష్ఠకు భంగం కల్గించొద్దంటూ లేఖలో కోరారు. ఢిల్లీలోని తీన్‌మూర్తి కాంప్లెక్స్‌ లో నెహ్రూ మెమోరియల్‌ ఉంది. ఈ కాంప్లెక్స్‌ను మాజీ ప్రధానుల మ్యూజియంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఈ విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు. గత శుక్రవారం ఈ లేఖను మోదీకి పంపినట్లు తెలుస్తోంది. ఇందులో మన్మోహన్‌ సింగ్‌ వాజ్‌పేయీ హయాం నాటి భాజపా ప్రభుత్వం తీరును కూడా ప్రస్తావించారు.‘చరిత్ర, వారసత్వానికి గౌరవమిచ్చి జవహార్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ జోలికి వెళ్లకుండా వదిలేయండి. నెహ్రూ కేవలం కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తే కాదు.. ఈ దేశానికి ప్రధాని. ఈ మెమోరియల్‌ భారత తొలి ప్రధానికి గుర్తు. 



నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియంను మార్చొద్దు
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మన్మోహన్‌ సింగ్‌ లేఖ

ఈ దేశం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన గొప్పతనాన్ని ప్రత్యర్థులు కూడా మెచ్చుకున్నారు. భాజపా అగ్రనేత వాజ్‌పేయీ హయాంలోనూ ఈ మెమోరియల్‌ మార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. కానీ ఇప్పుడు ఈ మెమోరియల్‌ను మార్చాలని ప్రభుత్వం అజెండాగా పెట్టుకోవడం బాధాకరం’ అని మన్మోహన్‌ లేఖలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా నెహ్రూ మరణించిన సమయంలో వాజ్‌పేయీ పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాన్ని కూడా మన్మోహన్ లేఖలో ప్రస్తావించారు. ‘పండిత్‌జీ మరణించిన సమయంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పార్లమెంట్‌లో ఇలా అన్నారు.. తీన్‌మూర్తి కాంప్లెక్స్‌కు మళ్లీ ఎవరు వచ్చినా నెహ్రూ ఉన్నప్పుడు వచ్చినంత ఖ్యాతీ రాదు. ఆయన వ్యక్తిత్వం అజరామరం. ప్రతిపక్షాలను ఏకతాటిపై తీసుకొచ్చే తత్వం, హుందాతనం, గొప్పతనం మళ్లీ చూడలేమేమో. ఆయన ఆదర్శాలు, ఈ దేశంపై ఆయనకున్న ప్రేమను మనమంతా గౌరవించాలి అని వాజ్‌పేయీ నెహ్రూను కొనియాడారు’ అని మన్మోహన్‌ గుర్తచేశారు. సెంటిమెంట్‌ను గౌరవించి నెహ్రూ మోమోరియల్‌కు మార్పులు చేర్పులు చేయొద్దని మన్మోహన్‌ ప్రధాని మోదీని కోరారు.

No comments:

Post a Comment