Breaking News

20/07/2018

కనుమరుగవుతున్న అటవీ సంపద

కరీంనగర్, జులై 20  (way2newstv.in)    
మొక్కల పెంపకం, వృక్షాలు, అటవీసంపద పరిరక్షణతోనే కాలుష్యాన్ని, భూతాపాన్ని అదుపులో ఉంచగలం. పర్యావరణాన్ని రక్షించుకోగలం. ఈ విషయం తెలిసీ.. అప్పటికప్పుడు అందే సొమ్ముకోసం.. భవితను సర్వనాశనం చేస్తున్నారు కొందరు. చెట్లను యథేచ్ఛగా నరికేస్తూ అడ్డదారుల్లో సొమ్ము చేసుకుంటున్నారు. కరీంనగర్ లో ఈ తరహా దందా కొంతకాలంగా సాగుతోందని, సంబంధిత అధికార యంత్రాంగం ఉదాసీనతతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు అంటున్నారు. వాస్తవానికి రాష్ట్రంలోనే అతి తక్కువ అటవీ విస్తీర్ణమున్న జిల్లా కరీంనగర్‌. 2128చ.కిమీ పరిధి ఉన్న జిల్లాలో కేవలం 3.47చ.కిమీ మేరనే అటవీ భాగం ఉందని సమాచారం. ఇంత తక్కువ స్థలంలో ఉన్న చెట్లతోపాటు మిగతా ప్రాంతాల్లో విరివిగా మొక్కల్ని నాటి వాటిని వృక్షాలుగా పెంచాలనే ప్రభుత్వం యత్నిస్తోంది. అందుకే జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలనే సంకల్పాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అటవీ ప్రాంతాన్ని పెంచేందుకు ఇంతగా ప్రాధాన్యతనిస్తున్నా.. స్థానికంగా మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. నాటిన మొక్కల సంరక్షణ సహా ఇప్పటికే వృక్షాలుగా ఉన్న చెట్ల రక్షణ విషయంలో నిర్లక్ష్యమే కనిపిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఏపుగా పెరిగిన చెట్లను పెద్ద మొత్తంలో నేలకూలుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.



కనుమరుగవుతున్న అటవీ సంపద

అటవీశాఖ ఉదాసీనత వల్లే విలువైన వృక్షసంపద కనుమరుగైపోతోందని స్థానికులు వాపోతున్నారు. విలువైన చెట్లను కొందరు వ్యాపారులు నేలకూలుస్తున్నారు. ఇదిచాలదన్నట్లు అక్రమార్కులు సైతం వృక్షాల నరికేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. గడిచిన ఏడాదిన్నరలోజిల్లాలో అక్రమంగా కలపను తరలిస్తున్న 108 మందిపై కేసులు నమోదు చేసినట్లు సంబంధిత అధికారులే చెప్తున్నారు. వీరి నుంచి వాహనాల స్వాధీనం సహా రూ.27.52 లక్షల జరిమానాను విధించినట్లు గణాంకాలు ఉన్నాయి. దొరికినవే ఇలా ఉంటే అధికారుల కంటపడనివి.. నిర్లక్ష్యంతో వదిలేసినవి అనేకం ఉంటాయని అంతా అంటున్నారు. దొంగచాటుగా కలపను తరలించే వాహనాల సంఖ్య దీనికి నాలుగింతలు అధికంగా ఉంటుందని స్పష్టంచేస్తున్నారు. వ్యాపారులపై కఠిన చర్యలు లేకపోవడం, నామమాత్రపు జరిమానాలకు వారు భయపడకపోవడంతోనే స్మగ్లర్లు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నెలలో ఎంతలేదన్నా 50-80 వాహనాలకు సరిపడా చెట్లు కనుమరుగవుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి వృక్ష సంపద విధ్వంసానికి చెక్ పెట్టాలని అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతా డిమాండ్ చేస్తున్నారు.

No comments:

Post a Comment