Breaking News

20/07/2018

సర్కారీ బడుల్లో బోధన సమస్య

ఆదిలాబాద్, జులై 20  (way2newstv.in)    
ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సర్కారీ బడులు మూతపడుతున్నాయన్న వార్తలతో పేద విద్యార్ధులు ఆందోళనలో కూరుకుపోయారు. విద్యార్ధి సంఘాలైతే సర్కారీ విద్య బడుగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో లేని పరిస్థితి ఉందని అంటున్నాయి. ఉపాధ్యాయులు లేక కొన్ని.. విద్యార్ధులు తగిన సంఖ్యలోలేక మరికొన్ని మూతపడే దుస్థితి ఉందని వ్యాఖ్యానిస్తున్నాయి. సమస్యలు పరిష్కరించకపోవడంతో పలు ప్రభుత్వ స్కూళ్లకు తాళాలు పడుతున్నాయంటున్నవారూ ఉన్నారు. ఇక ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు జరగడంతో కొన్ని పాఠశాలల్లో టీచర్లు లేని పరిస్థితి. తాజా బదిలీలతో పలు పాఠశాలల్లో గణితం, ఆంగ్లం, సైన్సు పాఠాలు బోధించేవారు కరవయ్యారని విద్యార్ధి సంఘాల నేతలు అంటున్నారు. ఇదిలాఉంటే జిల్లాలో మొత్తం 3178 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. అయితే 2609మంది ఉపాధ్యాయులే విధుల్లో ఉన్నారని సమాచారం. ఇందులో ఉపాధ్యాయ ఖాళీలతో పాటు విద్యార్థుల సంఖ్యను బట్టి మొత్తం 507 ఖాళీలను గుర్తించారు. వీటిని విద్యావలంటీర్లతో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాలంటీర్లు విధుల్లోకి వచ్చేందుకు పదిరోజులకుపైగా టైమ్ పడుతుందని అంచనా. అప్పటివరకు మూతపడ్డ పాఠశాలలు తెరుచుకోకపోవచ్చన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



సర్కారీ బడుల్లో బోధన సమస్య

జిల్లాలో కొన్నిపాఠశాలల్లో పదో తరగతి విద్యార్ధులకూ క్లాసులు సరిగా జరగడంలేదు. టీచర్ల బదిలీలతోనే ఈ ఇబ్బంది వచ్చాయన్న కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి. వేసవి సెలవుల్లోనే బదిలీ ప్రక్రియ ముగించి విద్యావలంటీర్లను నియమించి ఉంటే బోధన సమస్యలు తప్పి ఉండేవని పలువురు అంటున్నారు. జిల్లావిద్యాశాఖ పరిధిలో బదిలీల అనంతరం 61 ప్రాథమిక పాఠశాలలకు టీచర్లు అందుబాటులో లేరని టాక్. ఇలాంటి బడుల్లో కొన్ని మూతపడ్డాయి. ఒకట్రెండు చోట్ల అదనంగా ఉన్న ఉపాధ్యాయులను కేటాయించిన వారు వస్తే పాఠాలు లేదంటే బడికి తాళం వేయాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్ధి సంఘాల నేతలు అంటున్నారు. ఉన్నతాధికారులు ఉండే ఆదిలాబాద్‌ పట్టణంలో 7 పాఠశాలలు, బేలలో 7, బజార్‌హత్నూర్‌, గాదిగూడలో 16, నార్నూర్‌లో 11, సిరికొండలో 4, ఇచ్చోడలో 4, ఇంద్రవెల్లిలో 4, ఉట్నూర్‌ 3, మావల, బజార్‌హత్నూర్‌,  గుడిహత్నూర్‌లలో ఒకటి చొప్పున పాఠశాల్లో ఉపాధ్యాయుల సమస్య అధికంగా ఉందని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. గిరిజనసంక్షేమశాఖ పరిధిలో భీంపూర్‌, నార్నూర్‌, ఇంద్రవెల్లి, గాదిగూడ, సిరికొండ మండలాల్లో మొత్తం 26 ప్రాథమిక పాఠశాలల్లో సైతం బోధన సమస్య తాండవిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్ధుల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని అంతా కోరుతున్నారు.

No comments:

Post a Comment