Breaking News

05/07/2018

పార్టీకీ తలనొప్పిగా మారిన యనమల నిర్ణయం

విజయవాడ, జూలై 5   (way2newstv.in)     
ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు రాజనీతి తెలిసిన నిపుణుడే. ఇప్పుడు ప్రభుత్వం తరపున ఆయన చేయనున్న పోరాటం పార్టీ పరంగా నష్టం తెచ్చిపెట్టేలా వుంది. దీనికి కారణం పెట్రోల్, గ్యాస్ వంటివి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ససేమిరా అంటూ యనమల కేంద్రానికి లేఖ రాయడమే. అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఆయన నిర్ణయం సరైనదే అయినప్పటికి రాజకీయంగా ప్రజల్లో మైనస్ మార్క్ లే వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చాలా కాలంగా ఈ అంశం దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే సృష్టిస్తుంది. జీఎస్టీ పరిధిలోకి కేంద్రం పెట్రోల్, డీజిల్ ఎందుకు తేవడం లేదంటూ యువత ఉద్యమిస్తోంది. పార్టీకీ తలనొప్పిగా మారిన యనమల నిర్ణయం

60 శాతానికి పైగా అదనంగా జనం జేబులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లకొడుతున్నాయని అంతా గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే యనమల ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహారం చేయడం వివాదాస్పదం కావడంతో పాటు ఆయన్ను విమర్శల పాలు చేయనుంది.ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో జీఎస్టీ ని అమల్లోకి తెచ్చిన మోడీ సర్కార్ కి అనుకున్నంత మైలేజ్ ఈ కార్యక్రమంలో రాలేదు. ఇప్పటికీ ఏ స్లాబ్ లో ఏ వస్తువు ఉందో సామాన్యులకే కాదు మేధావులకు సైతం అర్ధం కావడంలేదు. వ్యాపారవర్గాలు సామాన్యుల తెలియనితనాన్ని ఆసరాగా చేసుకుని ప్రతి దానిపై జీఎస్టీ అంటూ గుంజేస్తున్నాయి. దాంతో జీఎస్టీ అంటేనే కస్సుమనే స్థాయిలోకి జనం వచ్చేశారు. కడుపుమండిన జనం జీఎస్టీ పై మోడీ సర్కార్ కి చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి తీరాలన్న డిమాండ్ ను నిత్యం సోషల్ మీడియా ద్వారా హోరెత్తిస్తున్నారు. దీనికి కౌంటర్ గా రాష్ట్రాలు అంగీకరించడం లేదంటూ కేంద్రం చెప్పుకొచ్చింది. వారు చెప్పింది నిజమే అన్న తీరున ఎపి మంత్రి లేఖ రాయడం ఆయనకు పార్టీకి తలపోటు తెచ్చిపెట్టేదే . ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ ఎన్నికల ముందు అనూహ్య చర్యలు తీసుకుని ప్రజల మన్ననలు అందుకునే ఎత్తుగడలు అనుసరించడానికి సమాయత్తం అవుతుంది.రాబోయే ఎన్నికల లోపు ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. వీటి ద్వారా వచ్చే పన్నులపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ కి మోడీ సర్కార్ ఇదే నిర్ణయం తీసుకుంటే ఖజానాకు భారీగా చిల్లుపడుతుంది. దీంతో ముందే మేల్కొన్న ఆర్ధికమంత్రి యనమల పోరాటం మొదలు పెట్టేశారు. ముందుగా ఈ వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తేవొద్దంటూ లేఖ రాశారు. కానీ యనమల లేఖకు పని జరిగినా జరగకపోయినా కేంద్రం తీసుకోబోయే ఈ నిర్ణయం ఏపీకి మాత్రం ప్రస్తుత పరిస్థితిలో నష్టమే తెచ్చిపెడుతుంది. రాష్ట్ర ప్రయోజనాలా ? రాజకీయ ప్రయోజనాలా అన్న లెక్కలు ఎన్నికల ముందు తప్పనిసరిగా ఏ పార్టీ అయినా వేసుకుంటుంది. టిడిపి ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక మాధ్యమాల్లో విమర్శలకు, ఆరోపణలకు ఇప్పటికే తెరతీసింది. మరి ఏపీ సర్కార్ ఇకపై ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.

No comments:

Post a Comment