Breaking News

04/07/2018

కాక రేపుతున్న డిప్యూటీ ఛైర్మన్ ఎలక్షన్

న్యూఢిల్లీ, జూలై 4, (way2newstv.in)
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికతో ఢిల్లీ రాజకీయంలో కాక పెరిగింది. ఈ పదవికి తమ నాయకుడిని ఎన్నిక చేయించుకోవడం అధికార పార్టీ బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. విపక్షాలను కూడగట్టుకుని పదవిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది. మరోపక్క ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకుని తమ అభ్యర్థిని ఎన్నిక చేయించుకోవాలని ప్రాంతీయ పార్టీలు తలపోస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో కూడా బిజూ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ వంటి పెద్ద ప్రాంతీయ పార్టీలు తమలో తాము ఈ పదవికోసం పోటీ పడుతున్నాయి. మొత్తానికి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక రసకందాయంలో పడింది. ఎవరికి వారు ఇతరుల ఎత్తులను, వ్యూహాలను పసిగడుతూ పై ఎత్తులు వేస్తున్నారు. ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ ఆరేళ్ల పదవీ కాలం ముగిసింది. కేరళకు చెందిన ఆయన 2012 ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలం ముగియడంతో ఎన్నిక అవసరమైంది. కురియన్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. లోక్ సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా,కేంద్ర మంత్రిగా సేవలందించారు. ఉన్నత విద్యావంతుడు. కాక రేపుతున్న డిప్యూటీ ఛైర్మన్ ఎలక్షన్

సాధారణంగా డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక అంత ఆసక్తికర విషయం కాదు. అధికార పార్టీకి చెందిన ఎవరో ఒకరు ఈ పదవిని చేపడుతుంటారు. రాష్ట్రపతిగా పనిచేసిన ప్రతిభా పాటిల్ 1986 నవంబరు 18 నుంచి 1988 నవంబరు 5 వరకూ ఈ పదవిని నిర్వహించారు. ఒకప్పటి కాంగ్రెస్ నాయకురాలు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న సజ్మా హెప్తుల్లా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా చాలాకాలం సేవలందించారు. తొలుత 1985 జనవరి 25వ తేదీ నుంచి 1986 జూన్ 10వరకూ పనిచేశారు. మళ్లీ 1988 నవంబరు 11 నుంచి 2004 జూన్ 10 వరకూ సుదీర్ఘకాలం సేవలందించారు. ఇంత ఎక్కువ కాలం డిప్యూటీ ఛైర్మన్ గా పనిచేసింది ఆమె మాత్రమే కావడం గమనార్హం.26 సంవత్సరాల అనంతరం డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఎన్నిక జరుగుతుండటం గమనార్హం. 1992లో ఎన్నిక జరిగింది. పెద్దల సభలో ప్రస్తుత పార్టీ బలాబలాలను చూస్తే ఏ పార్టీకి సొంతంగా అభ్యర్థిని గెలిపించుకునే శక్తి లేదు. మిత్రుల మద్దతు తప్పనిసరి. అటు ఎన్డీఏ, ఇటు యూపీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య అవగాహన, సమన్వయం లేకపోవడంతో ఎవరికి వారు తమకే పదవి కావాలని పట్టుబడుతున్నారు. 245 మంది సభ్యులు గల సభలో విజేతగా నిలవాలంటే 122 మంది మద్దతు అవసరం. అధికార బీజేపీకి 67, విపక్ష కాంగ్రెస్ కు 51 మంది సభ్యులున్నారు. ముందుగా బీజేపీ పావులు కదుపుతోంది. శివసేన, బిజూ జనతాదళ్, అవసరమైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి వంటి పార్టీల మద్దతుతో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు సిద్ధమవుతోంది. శివసేనతో విభేదాలు ఉన్నప్పటికీ అవసరమైతే ఆ పార్టీ అభ్యర్థినే బరిలోకి దించాలన్న యోచన చేస్తోంది. టీఆర్ఎస్ కు ఆరుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు, బిజూ జనతాదళ్ కు 9 మంది సభ్యులున్నారు. మరోవైపు నలుగురు నామినేటెడ్ పదవులను భర్తీ చేసే దిశగా బీజేపీ పావులు కదుపుతుంది. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్.సి.లహోటీ, బాలివుడ్ సూపర్ స్టార్ మాధురి దీక్షిత్, శివాజీ జీవితం ఆధారంగా పుస్తకం ‘‘జనతారాజ్’’ పుస్తకం రాసిన బాబా సహెబ్ పురందరేతో పాటు, పార్టీ సీనియర్ నాయకుడిని నామినేట్ చేసే అవకాశం ఉంది. దీంతో ఇతర ప్రయత్నాలూ చేస్తోంది.రెండో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ప్రస్తుతం అచేతనాస్థితిలో ఉంది. చిన్నాచితకా పార్టీలు తనకు మద్దతివ్వాలని కోరుతున్నా దాని గోడు పట్టించుకునే వారు లేరు. లేకపోగా తమకే మద్దతు ఇవ్వాలని ఆయా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ వేచి చూసే విధానాన్ని అవలంబిస్తోంది. విపక్ష శిబిరంలో తృణమూల్ కాంగ్రెస్ క్రియాశీలకంగా ఉంది. 13 మంది సభ్యులతో పెద్దల సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న టీఎంసీ తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ తో సహా ప్రాంతీయ పార్టీలను కోరుతోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బిజూ జనతాదళ్ వంటి పార్టీల మద్దతును ఆశిస్తోంది. శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ, అవసరమైతే కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. టీఎంసీ తన అభ్యర్థిగా సుఖేందు వేకర్ రాయ్ ను బరిలోకి దించే అవకాశముంది. కాంగ్రెస్ కు, బీజేపీలకు సమానదూరం పాటిస్తున్న తమకు మద్దతు ఇవ్వాలని బిజూ జనతాదళ్ కోరుతోంది. ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో జాతీయ పార్టీలతో ఎక్కడో చోట పొత్తు ఉందని, కానీ తమకు అలాంటి పరిస్థితి లేదని అది వాదిస్తోంది. సుదీర్ఘంగా ఒడిశాను ఏలుతున్న బిజూ జనతాదళ్ జాతీయ రాజకీయాల్లో ఇకపై క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తోంది. సభలో బిజూ జనతాదళ్ కు 9 మంది సభ్యులున్నారు. టీఆర్ఎస్ నాయకుడు కె. కేశవరావు పేరు కూడా ఒక దశలో విన్పించింది. ఆంగ్లం, హిందీపై పట్టుగల కేశవరావు ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టారు. మేధావిగా పేరుంది. తక్కువమంది బలం ఉండటం వల్ల ఆయన పేరు తెర వెనక్కు వెళ్లింది. మొత్తం మీద ఈ నెలలో జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఇది కీలకం అంశంగా మారనుంది. అధికార బీజేపీకి ఎన్ని అవకాశాలున్నాయో ప్రాంతీయపార్టీల ఉమ్మడి అభ్యర్థికీ అంతే అవకాశాలున్నాయి. చివరికి ఎవరు నెగ్గుతారో వేచిచూడాలి.

No comments:

Post a Comment