విజయవాడ, జూలై 5 (way2newstv.in)
జనసేన అధినేత పవన్ తో వైసీపీ చీఫ్ జగన్ చేతులు కలుపుతారా? జగన్ కూడా పలు ఇంటర్వ్యూల్లో ఇదే ప్రశ్నకు అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని, ఇంతవరకూ అటువంటి చర్చలే జరగలేదని చెప్పారు తప్ప పవన్ తో పొత్తు ఉండబోదని ఖరాఖండిగా చెప్పలేదు. దీంతో వైసీపీలో ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయాయి. ఒకటి పవన్ తో జగకడితే మేలన్నది ఒక వర్గం వాదనకాగా, ఒంటరిగా పోటీ చేయడం మేలన్నది మరో వర్గం గట్టిగా అభిప్రాయపడుతుంది. రెండు వర్గాలు తమ అధినేత జగన్ వద్ద తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేశారు. అయితే ఎవరి వద్దా జగన్ మాత్రం ఈ విషయంలో బయటపడటం లేదు.వైసీపీ, జనసేన పార్టీల మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదురుతుందని గత కొద్ది రోజులుగా విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ మేరకు పవన్ తోనూ చర్చలు జరిపారన్న వార్తలు వచ్చాయి.
పవన్,జగన్ కలిసి అడుగులు..?
రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే పవర్ గ్యారంటీ అన్న అభిప్రాయం వైసీపీలోని ఒక వర్గం నేతల్లో స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో వామపక్షాలతో కలసి పోటీ చేసిన జగన్ పార్టీ కొద్దిపాటి తేడాతో అధికారాన్ని కోల్పోయింది. దీంతో మరోసారి పొత్తులపై వైసీపీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.ఇప్పుడు ఒంటరిగా బరిలోకి దిగడం కరెక్టేనా? అన్న చర్చ పార్టీలో లోతుగా జరుగుతోంది. పవన్ సామాజిక వర్గానికి చెందిన నేతలు మాత్రం జనసేనతో పొత్తు ఉంటే బాగుంటుందని సూచిస్తున్నారు. పవన్ ప్రభావం దాదాపు ముప్ఫయి నుంచి నలభై నియోజకవర్గాల్లో ఉంటుందని, అందువల్ల పవన్ తో పొత్తుల చర్చలు ప్రారంభించాలని, అందుకు తమను అనుమతించాలని కూడా వైసీపీ సీనియర్ నేత ఒకరు జగన్ ను కోరినట్లు తెలిసింది.అయితే ఇందుకు జగన్ సున్నితంగా తిరస్కరించి, అప్పుడే పొత్తుల గురించి ఎందుకని… ఎన్నికల సమయంలో చూద్దామని చెప్పి పంపించివేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి అధికారంలోకి రాకుంటే పార్టీ ఇబ్బందులో పడుతుందని, అందుకే పొత్తు ఉండాలని సూచిస్తున్నారు.ఇదే సమయంలో మరో వర్గం ఒంటరిగా బరిలోకి దిగుదామని గట్టిగా వాదిస్తోంది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రతో ప్రజల్లో అనూహ్యమైన స్పందన వచ్చిందని, తాము ఊహించని ప్రాంతాల్లో సయితం జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ చీల్చుకునే అవకాశం లేదని కూడా గట్టిగా వాదిస్తున్నారు. పవన్ కల్యాణ్ ను ప్రజలు విశ్వసించడం లేదని, కేవలం గ్లామర్ కారణంగానే జనం ఆయన పర్యటనలకు రావడం తప్ప అవి ఓట్లుగా మారే అవకాశం లేదని చెబుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని వారు జగన్ వద్ద గణాంకాలతో సహా వివరించి వాదిస్తున్నారు. జట్టుకడితే ఎక్కువస్థానాలు ఇవ్వాల్సి వస్తుందని, పార్టీలో అసమ్మతి తలెత్తే అవకాశముందనికూడా వివరించారు. మరి ఎన్నికల నాటికి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
No comments:
Post a Comment