Breaking News

25/01/2020

రాయపాటికి షాక్ ఇచ్చిన డొక్క

గుంటూరు, జనవరి 25, (way2newstv.in)
ఏరు దాటే వ‌ర‌కే ఏటి మ‌ల్లన్న-అనే సామెత రాజ‌కీయాల‌కు బాగా న‌ప్పుతుంది. అవ‌స‌రం ఉన్నంత వ‌ర‌కు ఒక విధంగా .. అవ‌స‌రం తీరిపోయాక మ‌రొవిధంగా నాయ‌కులు వ్యవ‌హ‌రించ‌డం కామ‌న్ అయిపోయింది. తాజాగా గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్తితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు, గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న నేత రాయ‌పాటి సాంబ‌శివ‌రావు అనేక మంది నేత‌లకు లైఫ్ ఇచ్చారు. ప‌లువురిని రాజ‌కీయ నేత‌లుగా నిల‌బెట్టారు. ఇలాంటి వారిలో తాజాగా చ‌ర్చకు వ‌చ్చారు. మాజీ ఎమ్మెల్సీ (రెండు రోజుల కింద‌టే రాజీనామా చేశారు) డొక్కా మాణిక్యవ‌ర‌ప్రసాద్ వార్తల్లోకి వ‌చ్చారు.ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటున్న డొక్కా మాణిక్యవరప్రసాద్ ను రాయ‌పాటి సాంబ‌శివ‌రావు 2004 ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ కీయాల్లోకి తీసుకువ‌చ్చారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ టికెట్ కూడా ఇప్పించారు. 
రాయపాటికి షాక్ ఇచ్చిన డొక్క

దీంతో డొక్కా విజ‌యం కూడా సాధించారు. తాడికొండ‌లో రాయ‌పాటికి బంధుత్వాలు చాలా ఎక్కువ‌. అంత‌కు ముందు కొన్ని సంవ‌త్సరాలుగా అక్కడ రాయ‌పాటి రాజ‌కీయాల‌ను శాసించేవారు. అనంత‌రం, రాయ‌పాటి ఆయ‌న‌కు మంత్రి వ‌ర్గంలోనూ చోటు ద‌క్కేలా వ్యవ‌హ‌రించారు. దీంతో ముగ్గురు సీఎంల కాలంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ మంత్రిగా చ‌క్రం తిప్పారు.ఇలా అన్ని విధాలా రాజ‌కీయంగా ఎదుగుద‌ల‌కు దోహ‌ద‌మైన రాయ‌పాటి సాంబశివరావుని డొక్కా ప‌లుమార్లు గురువుగా సంబోధించారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న, కాంగ్రెస్ పూర్తిగా దెబ్బ‌తిన‌డంతో రాజ‌కీయంగా డొక్కాకు ఇబ్బంది క‌ర‌మైన ప‌రిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే క‌లుగ జేసుకున్న రాయ‌పాటి.. వైసీపీలోకి వెళ్లేందుకు 2014లో ప్రయ‌త్నిస్తున్న డొక్కాను టీడీపీవైపు మ‌ళ్లించారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు ఎమ్మెల్సీగా కూడా ప‌ద‌విని ఇప్పించారు. అదేవిధంగా విప్ పోస్టును కూడా ఇచ్చారు చంద్రబాబు. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల‌స‌మయంలో త‌న‌కు తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అయితే, పార్టీలో నెల‌కొన్ని పోటీ నేప‌థ్యంలో చంద్రబాబు ఆయ‌నకు రాయ‌పాటి సూచ‌న‌ల మేర‌కు ప్రత్తిపాడు కేటాయించారు.అయితే, జ‌గ‌న్ సునామీతో డొక్కా విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. దీంతో ఆయ‌న ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రత్తిపాడులో ఆయ‌న ఓటిమికి టీడీపీలో గ్రూపు రాజ‌కీయాలు కూడా ఓ కార‌ణ‌మ‌య్యాయి. అయితే, తాజాగా డొక్కా త‌న ప‌ద‌విని వ‌దులుకుని, చంద్రబాబుకురాజీనామా లేఖ పంపారు. మూడు రాజ‌ధానుల ప్రక‌ట‌న‌తో విస్మయం చెంది రాజీనామా చేసిన‌ట్టు చెప్పారు. అయితే, ఈ విష‌యాన్ని త‌న‌కు రాజ‌కీయ గురువైన రాయ‌పాటికి మాట మాత్రంగా అయినా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. రాయ‌పాటి రెండు మూడు సార్లు డొక్కాకు ఫోన్ చేసినా ఆయ‌న ఫోన్ ఎత్తలేద‌ని టాక్‌. ఇదే ఇప్పుడు రాయ‌పాటి వ‌ర్గంలో క‌ల‌వ‌రానికి కార‌ణ‌మైంది. గురువుకు చెప్పకుండా రిజైన్ చేసిన త‌ర్వాత వైసీపీలోకి చేరేందుకు ప్రయ‌త్నాలు చేసుకుంటున్నారనే ప్రచారం నేప‌థ్యంలో డొక్కా వ్యవ‌హారంపై రాయ‌పాటి వ‌ర్గం మండిప‌డుతోంది.

No comments:

Post a Comment