Breaking News

03/01/2020

కవితకు రాజ్యసభ సీటు..

న్యూడిల్లీ, జనవరి 3 (way2newstv.in)
గత సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ సభ్యురాలిగా పోటీ చేసి, ఓటమి పాలైన కల్వకుంట్ల కవితకు రాజ్యసభ స్థానం దక్కనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించి వచ్చే ఏప్రిల్‌లో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సీటు ఆమెకు కేటాయించే అవకాశమున్నట్లు టీఆర్ఎస్ నాయకులు విశ్వసనీయంగా తెలిపారు. అయితే, రెండో సీటు ఎవరికి దక్కుతుందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. తెలంగాణలో ఉన్న ఏడు రాజ్యసభ స్థానాల్లో ప్రస్తుతం ఐదు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్ నాయకులు ప్రాతినిథ్యం వహిస్తుండగా, మిగతా రెండు స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ప్రాతినిథ్యం ఉంది. తెలంగాణ నుంచి వచ్చే ఏప్రిల్ 9న గరికపాటి, కేవీపీల రాజ్యసభ పదవీ కాలం ముగిసిపోనుంది.తెలంగాణ నుంచి పదవీ విరమణ చేస్తున్న ఈ ఇద్దరూ కాంగ్రెస్, బీజేపీలకు చెందిన వారు. 
కవితకు రాజ్యసభ సీటు..

కానీ, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల బలం నేపథ్యంలో ఆ రెండు స్థానాలూ టీఆర్‌ఎస్‌కి ఏకగ్రీవంగా దక్కుతాయి. నిజానికి ఈ రెండు రాజ్యసభ స్థానాలు ఏప్రిల్‌ 9న ఖాళీ కానున్నప్పటికీ సీఈసీ ఫిబ్రవరి లేదా మార్చిలోనే ఎన్నికల ప్రక్రియను ముగించనుంది. గడువు దగ్గర పడుతుండడంతో అధికార టీఆర్‌ఎస్‌లో ఆ రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయనే చర్చ నడుస్తోంది. అయితే, ఏపీ కోటాలో ఉన్న కేకేకు మళ్లీ సభ్యత్వం దక్కడం అనుమానమేనన్న చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో నడుస్తోంది. వయసు రీత్యా ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపకపోవచ్చని అనుకుంటున్నారు మరోవైపు, రెండో సీటు కోసం టీఆర్ఎస్‌లో ఆశావహులు భారీగానే ఉన్నారు. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి కొనసాగించకపోవడంతో కొంత అసంతృప్తిగా ఉన్న నాయినిని రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నందున అవి ముగిశాకే, రాజ్యసభ బెర్తుల ఖరారుపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

No comments:

Post a Comment