Breaking News

04/01/2020

గల్ఫ్ లో యుద్ద మేఘాలు ...

అగ్రరాజ్యం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు !
న్యూ ఢిల్లీ జనవరి 4 (way2newstv.in)
అప్పుడెప్పుడో గల్ఫ్ వార్ గురించి విన్నాం. డిజిటల్ యుగంలోనూ యుద్ధాలు తప్పవా? అంటే అవుననే చెప్పాలి. అధికారాన్ని చేజిక్కించుకోవటం కోసం అత్యుత్తమ స్థానాల్లో ఉండే వారు తీసుకునే నిర్ణయాలు కోట్లాది మందిని ఎంతలా ప్రభావితం చేస్తాయన్నది తాజా ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అగ్రరాజ్యానికి అధినేత.. ప్రపంచానికి పెద్ద అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం పుణ్యమా అని పశ్చిమాసియా ఒక్కసారి వేడెక్కింది. గల్ప్ లో మరో యుద్ధానికి కారణం కానుంది. కొన్నాళ్లుగా ఉప్పు.. నిప్పుగా ఉన్న అమెరికా.. ఇరాన్ మధ్య ఉద్రిక్తతల్ని మరింత పెంచేలా అగ్రరాజ్యం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ వెన్ను విరిచేందుకు అమెరికా తీసుకున్న నిర్ణయం.. ఇరాక్ లో అమలు చేయటం విశేషం.
గల్ఫ్ లో యుద్ద మేఘాలు ...

ఇరాన్ సైన్యంలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తిగా చెప్పే రివల్యూషనరీ గార్డ్స్ కు జనరల్ గా వ్యవహరిస్తున్న 62 ఏళ్ల ఖాసిం సులేమానీని డ్రోన్ ను ప్రయోగించి అమెరికా హతమార్చింది. విదేశాల్లో ఉన్న తమ సిబ్బందిని రక్షించుకోవటం కోసమే తామీ చర్యను తీసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ పేర్కొంది.లెబనాన్ లేదంటే సిరియా నుంచి వచ్చిన సులేమాన్ బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు కార్గో ప్రాంతంలో అమెరికా డ్రోన్ సాయంతో క్షిపణుల్ని ప్రయోగించారు. రెండు క్షిపణులు రెండు కార్లను తాకాయి. దీంతో చోటు చేసుకున్నశక్తివంతమైన పేలుడుతో సులేమానీతో పాటు మొత్తం పది మంది చనిపోయారు. తమ జనరల్ ను హత్య చేసిన నేరగాళ్ల మీద ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అగ్రనాయకుడు అయతొల్లా అలీ ఖమైనీ వార్నింగ్ ఇచ్చారు. ప్రతీకారం తప్పదని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ తేల్చి చెప్పారు.ట్రంప్ ఆదేశాల మేరకే తామీ దాడిని చేపట్టినట్లు పెంటగాన్ స్పష్టం చేసింది. ఈ దాడిని అమెరికాలోని రిపబ్లికన్ నేతలు సమర్థించగా.. డెమోక్రటిక్ పార్టీ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం. ఇరాక్ లో చేపట్టే దాడిపై ముందుగా తమకు సమాచారం ఇవ్వకపోవటాన్ని అమెరికా కాంగ్రెస్ ఆక్షేపించింది. సులేమానీ హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఇదంతా ఈ ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసమే అన్న వాదన వినిపిస్తోంది.గల్ఫ్ లో శాంతి.. సుస్థిరత.. భద్రత భారత్ కు ఎంతో ముఖ్యమని విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంటే.. అంతర్జాతీయ సంబంధాల్లో బలప్రయోగానికి తామెప్పుడూ వ్యతిరేకమని చైనా స్పష్టం చేసింది. అమెరికా తాజా దాడిని ఇరాక్ ప్రధాని సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దాడి అనంతరం సోషల్ మీడియాలో మూడో ప్రపంచ యుద్ధమన్న పేరుతో హ్యాష్ టాగ్ వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి తన అధికారాన్ని కాపాడుకోవటానికి ప్రపంచాన్ని ప్రమాదంలో పడేసే వరకూ తెగించటాన్ని అమెరికన్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

No comments:

Post a Comment